కర్ణాటక పోలీసులను అరెస్టు చేసిన కేరళ పోలీసులు.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే!
ఈ కేసును విచారిస్తున్న కర్ణాటక పోలీసులు క్రిప్టో కరెన్సీ కుంభకోణానికి సంబంధించి ఒక నిందితుడు కేరళలో ఉన్నట్టుగా గుర్తించారు
By: Tupaki Desk | 5 Aug 2023 3:38 AM GMTపోలీసులే పోలీసులను అరెస్టు చేయడం అనేది చిత్రమే! ఎంత చిత్రమంటే.. కుక్క మనిషిని కరిస్తే కాదు.. మనిషి.. కుక్కను కరిస్తే అన్నంతగా చిత్రం! ఇక, ఈ చిత్రమైన ఘటన కేరళలో జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పోలీసులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఉండడం మరింత సంచలనంగా మారింది.
సాధారణంగా.. పోలీసులను పోలీసులు అరెస్టు చేయరు. ఎక్కడో భారీ లంచం ఆరోపణలో.. మరేమో.. అయితే తప్ప. కానీ, కీలకమైన క్రిప్టో కరెన్సీ కుంభకోణం దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడు, కర్ణాటక, కేరళలను కుదిపేస్తోంది. దీనిపై పెద్ద అలజడి కూడా జరుగుతోంది.ఈ కేసును విచారిస్తున్న కర్ణాటక పోలీసులు.. క్రిప్టో కరెన్సీ కుంభకోణానికి సంబంధించి ఒక నిందితుడు కేరళలో ఉన్నట్టుగా గుర్తించారు.
వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ బృందం కేరళకు వెళ్లింది. నిందితుడిని కూడా పట్టుకున్నారు. ఇంత వరకు కథ బాగానే జరిగింది. అయితే.. ఇక్కడే కర్ణాటక పోలీసుల చిత్తం చలించింది. చేతులు తడుపుకోవాలని అనుకున్నారు. అంతే.. నిందితుడితో బేరానికి దిగి. కేసును మాఫీ చేసేందుకు లేదా.. నిందితుడిని తప్పించేందుకు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు.
కీలకమైన కేసు కావడం.. జైలుకెళ్తే.. ఇప్పట్లో బయటకు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో నిందితుడు కూడా నగదు ఇచ్చాడు. ఇంకేముంది.. ఖుషీ చేసుకుందామన్నట్టుగా కర్ణాటక పోలీసులు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే.. ఇంతలోనే వారికి కేరళ పోలీసులు ఎదురొచ్చి.. అవినీతి, నిందితుడితో కుమ్మక్కవడం, అక్రమ సొమ్మును సేకరించడం వంటి సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి ఎస్సై సహా.. ఇతర సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.