Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ: క్రిప్టో కింగ్‌ కు 25 ఏళ్లు జైలు శిక్ష... 100 ఏళ్లు పడాల్సి ఉందంట!

మరోవైపు ప్రభుత్వం తరుపు న్యాయవాదులు మాత్రం.. చట్టప్రకారం బ్యాంక్ మన్ కు సుమారు 100 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉందని చెప్పడం గమనార్హం.

By:  Tupaki Desk   |   29 March 2024 6:53 AM GMT
వైరల్  ఇష్యూ: క్రిప్టో కింగ్‌  కు 25 ఏళ్లు జైలు శిక్ష... 100 ఏళ్లు పడాల్సి ఉందంట!
X

క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్.టీ.ఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్ మన్ ఫ్రీడ్ కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో... ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా.. ప్రధానంగా బిజినెస్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఈ తీర్పు వెలువడింది. మరోవైపు ప్రభుత్వం తరుపు న్యాయవాదులు మాత్రం.. చట్టప్రకారం బ్యాంక్ మన్ కు సుమారు 100 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉందని చెప్పడం గమనార్హం.

అవును... దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేఎంజ్ కంపెనీ ఎఫ్.టి.ఎక్స్. కో ఫౌండర్ శామ్‌ బ్యాంక్ మన్ కు న్యూయార్క్ కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి... విచారణ సమయంలో బ్యాంక్ మన్ అన్నీ అబద్ధాలే చెప్పారని.. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం పూర్తి అవాస్తవమని అన్నారు. ఇదే క్రమంలో... తప్పులు జరుగుతున్నట్లు బ్యాంక్ మన్ కు ముందే తెలుసని న్యాయమూర్తి తేల్చారు!

ఈ క్రమంలో బ్యాంక్ మన్ తరుపున న్యాయవాదులు... శిక్షను ఐదునుంచి ఆరున్నరేళ్లకు పరిమితం చేయాలన్ని కోరారు. అందుకు వారు చెప్పిన కారణాలు... ఇదే అతడి జీవితంలో తొలి నేరం, ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడలేదు, పైగా సంస్థ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇతడు బయట ఉంటే కస్టమర్లు తాము కోల్పోయిన సొమ్ములో మెజారిటీ భాగం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

అయితే... ప్రభుత్వం తరుపు న్యాయవాదులు మాత్రం 25 కాదు.. సుమారు 100 ఏళ్లు జైలు శిఖ విదించాల్సి ఉందని తెలిపారు! అయితే పాతికేళ్లు శిక్ష అనేది దీర్ఘకాల శిక్షే అయినప్పటికీ... ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధించాల్సిన శిక్షతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని తెలిపారు. ఈ మాత్రమైనా శిక్ష పడకపోతే.. ఫ్యూచర్ లో మరింత తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఎవరీ శామ్‌ బ్యాంక్ మాన్.. ఏమిటీ మోసం?:

వాల్ స్ట్రీట్ లో ఉద్యోగం వదిలేసిన బ్యాంక్ మన్... 2017 తర్వాత అల్మెడా రీసెర్చ్ పేరిట ఒక హెడ్జ్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో రెండేళ్ల తర్వాత ఎఫ్.టి.ఎక్స్. పేరుతో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ను నెలకొల్పారు. ఆ సమయంలో క్రిప్టో ర్యాలీతో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఇతడి సంపద 26 బిలియన్ డాలర్కు చేరింది.

అయితే... ఎఫ్.టీ.ఎక్స్, అలమెడా రీసెర్చ్.. ఈ రెండు కంపెనీలు వేరు వేరని బ్యాంక్ మన్ చెప్పేవారు. కానీ.. అది పూర్తిగా అవాస్తవం అని తర్వాత తేలింది. అలమెడా ఆస్తుల్లో చాలా వరకూ ఎఫ్.టీ.ఎక్స్. ఆవిష్కరించిన ఎఫ్.టీ.టీ. క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తేలింది. అయితే.. వాస్తవానికి ఈ టోకెన్లనీ ఈ రెండు సంస్థల ఆధీనంలోనే ఉన్నాయి. అసలు సర్క్యులేషన్ లో ఉన్నవి చాలా తక్కువ. అంటే... అలమెడా అనే సంస్థ విలువ పూర్తిగా ఊహాజనితం అన్నమాట.

ఈ వ్యవహారం కాస్త బయటకు రావడంతో... కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్ మన్ ను గత ఏడాది నవంబర్ లో కోర్టు దోషిగా తేల్చింది. ఈ క్రమంలో సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తించింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని తెలిపింది.