రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట రచ్చ... అసలేం జరిగిందంటే..?
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 6 Dec 2024 10:40 AM GMTరాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్ట తీవ్ర సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి కేటాయించిన సీటు వద్ద ఈ కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అవును... రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా.. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
అసలేం జరిగిందంటే..?:
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. గురువారం నాడు సభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్ లో సాధారణ తనిఖీలు చేపట్టారని తెలిపారు.
ఈ క్రమంలో... 222వ నెంబర్ సీటు వద్ద ఓ కరెన్సీ నోట్ల కట్ట కనిపించిందని.. అది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు అని.. ఈ విషయం తన దృష్టికి రాగానే దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. దీంతో... సభలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఛైర్మన్ ప్రకటనను ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు... పేరు చెబితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆ సీటు వద్ద ఎవరు కుర్చుంటారో చెప్పారని.. అందులో సమస్య ఏమిందని ప్రశ్నించారు. సభకు ఇలా నోట్ల కట్టలు తీసుకురావడం సరికాదని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఈ పరిణామాలపై సింఘ్వీ స్పందించారు. ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని.. తాను రాజ్యసభకు ఒక రూ.500 నోటు మాత్రమే తీసుకెళ్లానని.. మధ్యాహ్నం 12:57 గంటలకు సభ లోపలికి వచ్చానని.. ఒంటి గంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్ కు వెళ్లి, 1:30కి పార్లమెంట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.