Begin typing your search above and press return to search.

బెజవాడ జల ప్రళయం : ప్రతీ ఇంటికీ ఊహకు అందని నష్టం...కష్టం !

ఇపుడున్న పరిస్థితుల్లో మళ్లీ బెజవాడ వాసులు కోలుకుని తాము ఉన్న పూర్వ స్థితికి రావాలంటే ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు అని అంటున్నారు నిజం చెప్పాలంటే కట్టు బట్టలతోనే అంతా మిగిలారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 3:47 AM GMT
బెజవాడ జల ప్రళయం : ప్రతీ ఇంటికీ ఊహకు అందని నష్టం...కష్టం !
X

బెజవాడను ముంచెత్తిన మహా ప్రళయం వల్ల ప్రతీ ఇలూ నష్టం కష్టం చవి చూసింది. పాతిక లక్షలకు పైగా జనాభా ఉన్న బెజవాడలో అందులో ఎనభై శాతం ప్రజానీకం ఈ భారీ విలయానికి డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యారు అని అంటున్నారు. ప్రతీ ఇంటికీ సగటున పది నుంచి పదిహేను లక్షల దాకా నష్టం మిగిల్చిన పెను విషాదంగా చెబుతున్నారు.

ముఖ్యంగా విజయవాడ విస్తరించి ఉన్నది అంత కొండల మీద కరకట్ట మీద చెరువులు ఇతర వాగులు వంకల మీద ఆవాసాలతోనే వారే నూటికి ఎనభీ శాతం ఉన్నారు. ఈసారి వచ్చిన భారీ వర్షాలు అలాగే దానితో పాటు వచ్చి పడిన వరదలు జన జీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఏ ఒక్కరి ఇంట్లోనూ శాంతి లేకుండా చేశాయి.

ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి అంతా వరదకు సమర్పణం అయింది. టీవీలు, ఫ్రిజులు మోటారు సైకిళ్ళు, ఇతర ఖరీదైన వస్తువులు అన్నీ కూడా వరదలో కొట్టుకుని పోయాయి. అంతే కాదు గొడ్డూ గోదా కూడా పోయాయి. ఇంక చాలా ఇళ్లలో చొరబడిన వరద నీరు వారికి ఏమీ విలువైన సామాను లేకుండా చేసింది. అన్నీ నీటిలో పడి ఎందుకు పనికిరాకుండా పోయాయని విలపిస్తున్నారు.

ఇక విలువైన డాక్యుమెంట్లు ఇతర వస్తువులు అన్నీ కూడా వరదమ్మకు అర్పితం అయిపోయాయి అని అంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఖరీదు అయిన కార్లు కూడా వరదల వల్ల పూర్తిగా నాశనం అయ్యాయి. ఇవి మళ్లీ పనికి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు అని అంటున్నారు.

ఈ మొత్తం చూస్తే కనుక ప్రతీ ఇంట్లో భారీగానే ఆస్తి నష్టం సంభవించింది అని అంటున్నారు. ఈ ఆస్తి నష్టానికి వెలకట్టి తిరిగి ఇచ్చేది ఏదీ పెద్దగా ఉండదు అనే అంటున్నారు. ఎందుకంటే ఇదంతా ఎవరూ ఊహించినది కాదు, ఒకవేళ ఇచ్చినా అరకొర సాయమే అందుతుంది. దాంతో లక్షలలో ఆస్తి నష్టం జరీతే ఆ నష్టపరిహారం ఏ మూలకు అన్న బాధ ఉండనే ఉంటుంది.

ఇపుడున్న పరిస్థితుల్లో మళ్లీ బెజవాడ వాసులు కోలుకుని తాము ఉన్న పూర్వ స్థితికి రావాలంటే ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు అని అంటున్నారు నిజం చెప్పాలంటే కట్టు బట్టలతోనే అంతా మిగిలారు. ఇది దారుణమైన విషయం.

మళ్లీ వారు మొదటి నుంచి బతకాలి. మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టాలి. వారికి సాయం చేయడానికి ప్రభుత్వానికి సైతం సరిపోదు. మిగిలిన సమాజం ఏమైనా ఆదుకుంటే ఎంతో కొంత వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి వచ్చిన వరదలు మొత్తం జీవితాలనే మార్చేశాయని లక్షలాది మందికి రేపటి రోజు అన్న దాని మీద ఏ ఆశ లేకుండా చేశాయని విలపిస్తున్నారు.