రఘురామ కేసులో బిహార్ లింకు? ఐపీఎస్ అధికారికి నోటీసులు
ఈ కేసుతో లింకు ఉన్న బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణకు రమ్మంటూ పోలీసులు వాట్సాప్, ఫ్యాక్స్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
By: Tupaki Desk | 2 March 2025 8:29 AM GMTడిప్యూటీ స్పీకర్ రఘురామ రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుతో లింకు ఉన్న బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణకు రమ్మంటూ పోలీసులు వాట్సాప్, ఫ్యాక్స్ ద్వారా నోటీసులు జారీ చేశారు. గతంలో ఏపీలో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ అప్పటి ఎంపీ రఘురామరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసి రాష్ట్రానికి తెచ్చిన సమయంలో కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకం కానుందని చెబుతున్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా బిహార్ క్యాడరుకు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. సునీల్ నాయక్ గతంలో డిప్యూటేషన్ పై ఏపీ సీఐడీలో డీఐజీగా పనిచేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యుటేషన్ రద్దు చేసుకుని సొంత క్యాడర్ బిహార్ వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై రఘురామ సీఐడీ అధికారులపై గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గుడివాడ టీడీపీలో కీలక నేతగా పనిచేస్తున్న తులసిబాబును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనపై వేధింపులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని రఘురామ ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవడం చర్చనీయాంశమవుతోంది. రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ వచ్చారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాలు ఆధారంగా సునీల్ నాయక్ పాత్రపైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. సునీల్ నాయక్ ప్రస్తుతం బిహార్ అగ్నిమాప విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు.