Begin typing your search above and press return to search.

అనంతపురంలో సైబర్ అరెస్ట్.. రైల్వే ఉద్యోగి ఎలా బలి అంటే..?

తాజాగా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ. 72 లక్షలు పోగొట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   30 Oct 2024 5:30 PM GMT
అనంతపురంలో సైబర్  అరెస్ట్.. రైల్వే ఉద్యోగి ఎలా బలి అంటే..?
X

"క్షణం ఆగండి.. ఆలోచించండి.. ఆ తర్వాతే స్పందించండి.." అనేదాన్ని మంత్రంగా పాటిస్తే ప్రజలు ఆన్ లైన్ స్కాముల నుంచి బయటపడవచ్చని "మన్ కీ బాత్" కార్యక్రమంలో సైబర్ నేరాల తీవ్రతను గురించి ప్రధాన మంత్రి మోడీ స్పందించారు. అప్రమత్తత చాలా అవసరమని నొక్కి చెప్పారు! దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అయినప్పటికీ ఈ సైబర్ నేరాళ్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది! పైగా పోలీసులు పరిష్కారాలు కనుగొనే కొద్దీ సరికొత్త దారులు వెతుకుతూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగా... తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ మాయంలో పడి ఓ ఉద్యోగి రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు.

అవును... అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నా.. వీటి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ వలీ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ. 72 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇతడు రైల్వే గార్డుగా పని చేస్తున్నాడు.

అసలేం జరిగిందంటే... ఇటీవల ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు, సీబీఐ అధికారులమని చెప్పి మహమ్మద్ వలీకి ఓ వీడియో కాల్ వచ్చింది.. ఆ ఫోన్ సైబర్ నేరగాళ్లదని అప్పటికి వలీ గ్రహించలేకపోయాడు. ఈ సమయంలో.. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో నీ పేరు ఉందని వలిని బెదిరించారు సైబర్ నేరగాళ్లు.

అనంతరం... వెంటనే అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కొంత డబ్బు పంపాలని బెదిరించారు. ఈ క్రమంలో.. పలు దఫాలుగా రూ.72 లక్షల సొమ్మును కొట్టేశారు. ఇంత పోగొట్టుకున్న తర్వాత గ్రహించాడో ఏమో కానీ... తాను సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు చెబుతూ గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహమ్మద్ వలి.

ఈ సందర్భంగా స్పందించిన వలీ... తన కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని వాపోతున్నారు! దీంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.