ఎయిర్ పోర్ట్ పై సైబర్ దాడి... మూడోరోజు కొనసాగుతున్న అంతరాయం!
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడం, మనిషి జీవితం పూర్తిగా టెక్నాలజీతో ముడిపడి ఉండటం తెలిసిందే.
By: Tupaki Desk | 27 Aug 2024 9:24 AM GMTప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడం, మనిషి జీవితం పూర్తిగా టెక్నాలజీతో ముడిపడి ఉండటం తెలిసిందే. ఈ సమయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తూ, అస్తవ్యస్థం చేసే ప్రయత్నాలు కూడా అవిరామంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయంపై సైబర్ దాడి జరగడంతో వేల మంది ప్రాయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అవును... ఇటీవల కాలంలో సైబర్ దాడులు తరచూ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజగా అమెరికాలో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా సీటెల్ - టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో... ఇంటర్నెట్, ఫోన్ ఇతర కమ్యునికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో... వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఈ ఘటనపై స్పందించిన సీటెల్-టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్... అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించడానికి తాము 24గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, కస్టమ్స్ అండ్ సెక్యూరిటీస్ సహా అన్ని సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... ప్రయాణికులు ఈ పరిస్థితుల్లో కాస్త అదనపు సమయాన్ని అనుమతించాలని.. చెక్ ఇన్ ల కోసం మొబైల్ అప్లికేషన్ లను ఉపయోగించాలని .. సాధారణం కంటే ఎక్కువసేపు ఉండే సెక్యూరిటీ లైన్లు, బ్యాగేజీ క్లైం వెయిటింగ్ టైం కోసం సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఈ ఎటాక్ కారణంగా టెర్మినల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ లు పనిచేయడం లేదని అంటున్నారు.
కాగా.. సీటెల్ - టాకోమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శనివారం సైబర్ అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం సోమవారం మూడో రోజు కూడా కొనసాగింది. ఫలితంగా... ఇంటర్నెట్, ఫోన్, ఈ-మెయిల్, ఇతర వ్యవస్థలకు అంతరాయం కలిగింది. ఈ సమయంలో పూర్తి సేవలను పునరుద్ధరించడానికి అవిరామంగా పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.