Begin typing your search above and press return to search.

సినీ నటికి సైబర్ నేరగాళ్ల టోకరా!

సైబర్ నేరగాళ్లు.. వారి ఆరాచకాల గురించి తరచూ వింటున్నాం. ప్రతి సైబర్ నేరంలోనూ ఒక అంశం కీలకంగా మారుతుంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 6:57 AM GMT
సినీ నటికి సైబర్ నేరగాళ్ల టోకరా!
X

సైబర్ నేరగాళ్లు.. వారి ఆరాచకాల గురించి తరచూ వింటున్నాం. ప్రతి సైబర్ నేరంలోనూ ఒక అంశం కీలకంగా మారుతుంది. అదే.. ఆశ. మనకు ఏదైతే లేదో.. దాన్ని సులువుగా వచ్చేలా చేస్తామంటూ ఎర వేయటం చేస్తుంటారు. ఈ ట్రాప్ లో ఒకసారి చిక్కుకున్న తర్వాత నష్టపోకుండా బయటపడటం చాలా అరుదు. తాజాగా అలాంటి ఎరకు చిక్కుకుపోయారు ఒక సినీ నటి.

కుందన్ బాగ్ లో నివసించే ఒక సినీ నటికి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. 24 ఏళ్ల మహిమా గౌర్ సినిమాల్లో పని చేస్తుంటారు. పెద్ద ప్రాధాన్యత కలిగిన పాత్రలు లేనప్పటికీ.. తన సత్తా చాటాలన్న తపనతో ఆమె ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల ఆరున రంజన్ షాహీ పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను తాను సినిమా నిర్మాతగా పరిచయం చేసుకున్నారు. అవకాశాల గురించి మాట్లాడారు.

అనంతరం అతడి సూచనల మేరకు అనిత అనే మరోమహిళ ఆమెకు ఫోన్ చేశారు. తాను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) నుంచి హెచ్ఆర్ డైరెక్టర్ గా తనను పరిచయం చేసుకున్నారు. సింటాలో జీవితకాలం పని చేసే కార్డును అందిస్తున్నట్లుగా పేర్కొంటూ.. అందుకు ఫీజుగా రూ.50,500 ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. దీంతో.. ఆమె మాటల్ని నమ్మిన మహిమా గౌర్ మూడు దఫాలుగా డబ్బును బదిలీ చేశారు.

ఈ ప్రాసెస్ లో మహిమా గౌర్ కు సందేహం వచ్చి.. తాను మోసపోతున్నట్లుగా భావించారు. వెంటనే సైబర్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. సైబర్ నేరగాళ్లకు ఆమె పంపిన మొత్తంలో రూ.20,200 మొత్తాన్ని మాత్రం సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.