Begin typing your search above and press return to search.

నిత్యం మాస్క్.. బత్తుల ప్రభాకర్.. ఈ దొంగ స్టయిల్, టార్గెట్లే వేరు

గత శనివారం సైబరాబాద్ పోలీసులపై ఓ పబ్ లో కాల్పులు జరిగిన ఘటనలో నిందితుడు బత్తుల ప్రభాకర్ బ్యాక్ గ్రౌండ్ వింటే నోరెళ్లబెట్టక మానరు. ఇతగాడి చోరీల స్టోరీలు సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువ కాదు.

By:  Tupaki Desk   |   2 Feb 2025 3:30 PM GMT
నిత్యం మాస్క్.. బత్తుల ప్రభాకర్.. ఈ దొంగ స్టయిల్, టార్గెట్లే వేరు
X

వాయు కాలుష్యం ఉంటేనో... బయటకు వెళ్తున్నప్పుడో.. లేదా కరోనా మహమ్మారి వంటివి వ్యాప్తి చెందుతున్నప్పుడో.. మనందరం ముఖానికి మాస్క్ లు పెట్టుకుంటాం.. కానీ, ఇతడు మాత్రం ఎప్పుడూ మాస్క్ లోనే కనిపిస్తాడు.

తెలుగు సినిమాల్లో మనం ఎందరో దొంగలను చూసి ఉంటాం.. దొంగతనమే స్టోరీగా ఎన్నో సినిమాలు చూసి ఉంటాం.. అయితే, వీటిలోని మలుపులను మించి రియల్ దొంగ ఇతడు.

గత శనివారం సైబరాబాద్ పోలీసులపై ఓ పబ్ లో కాల్పులు జరిగిన ఘటనలో నిందితుడు బత్తుల ప్రభాకర్ బ్యాక్ గ్రౌండ్ వింటే నోరెళ్లబెట్టక మానరు. ఇతగాడి చోరీల స్టోరీలు సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే అంతకుమించి.

పోలీసుల నుంచి ప్రభాకర్ తప్పించుకున్న తీరు అయితే మరో లెవెల్. తెలుగు రాష్ట్రాల్లో చోరీలు సాగించే బత్తుల ప్రభాకర్ ప్రధాన టార్గెట్ ఏపీలోని విశాఖపట్నం, తెలంగాణలోని హైదరాబాద్ వంటి మెట్రో నగరాలే. వీటిలోనూ అతడు ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ చేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ నిత్యం డబ్బుల తిరుగుతుంటాయని అతడి లెక్క. ఇక దొంగతనాల సమయంలో ప్రభాకర్ సీసీ కెమెరాలకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నిత్యం ముఖానికి మాస్కు ధరిస్తాడు.

దొంగ సొమ్ముతో దర్జా..

దొంగతనం చేయగా వచ్చిన సొమ్ముతో ప్రభాకర్ హై ఫై ఏరియాల్లోని బార్లు, పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. ఇప్పటికే అతడిపై 80 దాకా చోరీ కేసులు ఉండడం గమనార్హం. మూడేళ్ల కిందట విశాఖపట్నం పోలీసులకు దొరికాడు. కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు. మళ్లీ దొరక్కుండా చోరీలు సాగిస్తున్నాడు. ఇటీవల మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీలో ప్రభాకర్ వేలిముద్రలు దొరకడంతో మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వేట సాగిస్తున్నారు. వీకెండ్స్ ప్రిజమ్ పబ్ పరిసరాలకు వస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. శనివారం సాయంత్రం మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి, పోలీసులు మాటు వేశారు. పోలీసులను గుర్తించిన ప్రభాకర్ తప్పించుకునే క్రమంలో నేరుగా ప్రజమ్ పబ్ లోకి దూరాడు. పోలీసులూ అందులోకి వెళ్లగా ప్రభాకర్ కాల్పులకు దిగాడు. ఓ బుల్లెట్ వెంకట్రామిరెడ్డి తొడలోకి దూసుకుపోయింది. ఇద్దరు పబ్ సిబ్బంది గాయపడ్డారు. అయినా పట్టువదలని పోలీసులు.. ప్రభాకర్ ను పట్టుకున్నారు.

కాల్పులు జరపగా.. ప్రభాకర్ చేతిలోని పిస్టల్ లో ఇంకా 23 బుల్లెట్లు ఉన్నాయట. వీటన్నింటినీ అతడు వినియోగించి ఉంటే… ప్రిజమ్ పబ్ లో ఏం జరిగి ఉండేదో ఊహించవచ్చు. ప్రభాకర్ కోటులో ఇంకో పిస్టల్ కూడా ఉందట. ఏకకాలంలో రెండు పిస్టళ్లు ఉన్నాయంటే అతడు ఎంతటి నేర్పరో తెలుస్తోంది. పోలీసులను చూసినంతనే అతగాడు దూకిన తీరు.. కాల్పుల సమయంలో భయం లేకపోవడాన్ని గుర్తించారు. ప్రభాకర్ వివరాలను సైబరాబాద్ సీపీ అభిషేక్ మహంతి వివరించిన సందర్భంగా పోలీసులే నోరెళ్లబెట్టారట.