యూఎస్ ఆస్పత్రులపై సైబర్ అటాక్.. నిలిచిపోయిన వైద్య సేవలు
దీంతో... అగ్రరాజ్యం అమెరికాలో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
By: Tupaki Desk | 29 Nov 2023 4:49 AM GMTఅమెరికాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. థ్యాంక్స్ గివింగ్ సెలవు రోజున పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులపై దాడులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా పలు ఆస్పత్రుల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. దీంతో... అగ్రరాజ్యం అమెరికాలో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా... అత్యవసర పరిస్థితి లేని ఆపరేషన్ లను వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
అవును... అమెరికాలోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. న్యూ మెక్సికో, న్యూ జెర్సీ, ఓక్లహామా రాష్ట్రాల్లోని సుమారు 25 నుంచి 30 ఆసుపత్రుల్లో అర్డెంట్ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ వైద్య సేవలు, ఇతర సర్వీసులను అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆ ఆస్పత్రుల్లోని మెడికల్ సాఫ్ట్ వేర్ సిస్టంను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో ఆసుపత్రుల్లోని వైద్య, ఆర్థికపరమైన కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆర్డెంట్ సంస్థ... సాఫ్ట్ వేర్ సేవల్ని పునరుద్దరించడానికి తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అ సమస్య పరిష్కరించబడే వరకు సాధారణ వైద్యసేవలు మాత్రం కొనసాగుతాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ వార్డుల్లోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపింది.
ఇదే సమయంలో... అత్యవసర పరిస్థితి లేని ఆపరేషన్ లను వాయిదా వేసినట్లు ప్రకటించింది. అయితే, సైబర్ దాడిలో ఎటువంటి సమాచారం చోరీకి గురైందనేది ఇప్పుడే చెప్పలేమని.. కాకపోతే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇందులో భాగంగా... కొన్ని అత్యవసర, ఎంపిక ప్రక్రియలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. సాఫ్ట్ వేర్ వ్యవస్థను పునరుద్దరించే వరకూ కొంతమంది అత్యవసర రోగులను ఇతర ఆసుపత్రులకు మళ్లిస్తున్నట్లు చెబుతూ.. ఈ దాడి తమ నెట్ వర్క్ ను ఆఫ్ లైన్ లోకి తీసుకువెళ్లిందని తెలిపింది.
ఈ విషయాలపై సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎమ్సిసాఫ్ట్ నిపుణుడు బ్రెట్ కాలో స్పందించారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది అమెరికాలో కనీసం 35 దాడులు జరిగాయని తెలిపారు. ఆ సమయంలో డ్యూటీలో తక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారని హ్యాకర్లు విశ్వసించినప్పుడు.. సాధారణంగా సెలవు రోజుల్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.