1000 కి 1300 వచ్చిందని 5 లక్షలు పెట్టింది... తర్వాత ఏమి జరిగింది?
ఎవరో సెలబ్రెటీ చెప్పారని తొందరపడి తప్పులో కాలు వేయవద్దని.. జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయాలని.. సందేహం వస్తే అధికారులను సంప్రదించాలని అంటున్నారు.
By: Tupaki Desk | 25 May 2024 12:30 AM GMTటెక్నాలజీ పెరిగేకొద్దీ రోజు రోజుకీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కేస్తున్నారు. సెలబ్రెటీల ఫేక్ ఇంటర్వ్యూలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అమాయకులకు సైబర్ వల వేస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి నేరాలపై అప్రమత్తత చాలా అవసరం అని చెబుతున్నారు అధికారులు. ఎవరో సెలబ్రెటీ చెప్పారని తొందరపడి తప్పులో కాలు వేయవద్దని.. జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయాలని.. సందేహం వస్తే అధికారులను సంప్రదించాలని అంటున్నారు.
అవును... స్టాక్ మార్కెట్ లో మీ డబ్బును పెట్టుబడిగా ఉంచండి.. సుమారు నాలుగు రెట్ల లాభాలు పొందండి.. తమ కంపెనీలో పెట్టుబడి పెట్టండి అధిక లాభాలు పొందండి అనే ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా సెలబ్రెటీల కు సంబంధించిన బోగస్ ఇంటర్వ్యూలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన వీడియోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
వాస్తవానికి ఇటువంటి ప్రకటనలు నమ్మిన జానాల ఖాతాల్లో ముందుగా కొంత మొత్తాన్ని జమ చేసి, ఆశ చూపించి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించిన తర్వాత... మొత్తానికి ముంచేస్తున్నారని అంటున్నారు. తాజాగా విజయ్వాడకు చెందిన ఓ మహిళ.. సోషల్ మీడియాలో వచ్చిన ఒక ప్రకటన చూసి ఆకర్షితురాలయ్యారు. తక్కువ పెట్టుబడితో స్టాక్ మార్కెట్ లో ఎక్కువ లాభాలు పొందవచ్చనే మాటలను నమ్మింది!
దీంతో.. అనుకున్నదే తడవుగా ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. దీంతో... ముందుగా జస్ట్ రూ.1000 పెట్టుబడి పెడితే సరిపోతుందని చెప్పారు. అనుకున్నట్లుగానే ఆమె రూ.1000 పెట్టుబడి పెడితే రూ.1300 వచ్చింది. దీంతో షార్ట్ టైం లో మంచి ప్రాఫిట్ వచ్చేలా ఉందని భావించిన ఆ మహిళ.. విడతల వారీగా సుమారు రూ.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారంట.
అక్కడ మొదలైంది అసలు వ్యవహారం. ఎప్పుడైతే ఐదులక్షల వరకూ పెట్టుబడి పెట్టారో.. ఆ తర్వాత అవతలి ఫోన్ మూగబోయిందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ మహిళ సంగతి అలా ఉంటే... మరో వ్యక్తి సుమారు 10 లక్షల వరకూ నష్టపోయారని అంటున్నారు. ఈ సమయంలో మోసపోయినట్లు గుర్తించిన వెంటనే ఆ వివరాలు తమకు వెల్లడించాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు.
పైగా... ఈ వ్యవహారంలో ప్రకటనలు, వీడియోలు సెలబ్రెటీల ఫోటోలతోనూ, వీడియోలతోనూ ఉండటం వల్ల సామాన్యులు తొందరగా నమ్మి, మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తత చాలా అవసరం అని నొక్కి చెబుతున్నారు!