Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాలకు దడ పుట్టిస్తున్న ‘దానా’ తుపాను

అల్పపీడనంగా మొదలై మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారిన దానా.. సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:58 AM GMT
నాలుగు రాష్ట్రాలకు దడ పుట్టిస్తున్న ‘దానా’ తుపాను
X

ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న తుపానులతో ఏపీ వణుకుతోంది. ఈ మధ్యనే కురిసిన భారీ వర్షాలతో విజయవాడ ఆగమాగం కావటం.. దాని నుంచి తేరుకున్నదో లేదో.. ఏపీకి మరో విపత్తును సవాలుగా విసిరింది ప్రకృతి. బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారిన దానా.. ఇప్పుడు నాలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. దీంతో కేంద్రం ఏపీ.. ఒడిశా.. పశ్చిమబెంగాల్.. తమిళనాడు ప్రభుత్వాల్నిఅలెర్టు చేసింది. అల్పపీడనంగా మొదలై మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారిన దానా.. సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది.

వాతావరణ శాఖకు చెందిన అధికారుల అంచనా ప్రకారం గురువారం తెల్లవారుజాము నాటికి దానా తుపాను తీవ్ర తుపానుగా మారుతుందని చెబుతున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు ఒడిశాలోని పూరీ.. పశ్చిమ బెంగాల్ లో నుంచి సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చన్న అంచనా వేస్తున్నారు. తాజా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర మీద చూపించొచ్చని చెబుతున్నారు.

దానా తుపాను తన గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని.. ఇదే సమయంలో విజయనగరం.. పార్వతీపురం.. మన్యం.. శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని చెబుతుననారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తమిళనాడు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ విభాగం అంచనా ప్రకారం మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది.

దానా తుపాను తీవ్రతను పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దుచేవారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దు అయ్యాయి. రద్దు అయిన రైళ్లలో అత్యధికం హావ్ డా.. భువనేశ్వర్.. ఖరగ్ పూర్.. పూరీ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లనే రద్దు చేశారు. విశాఖ - భువనేశ్వర్ మధ్య నడిచే వందేభారత్ రైలును సైతం 24న రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.