వేడి తగ్గిన దాడి...లేదుగా సందడి !
ఆయన మాటలలో వేడి వాడి ఉంటుంది. మంచి భాషతో పాటు చమత్కారాలు వాడతారు ప్రత్యర్ధులను తనదైన వాక్చాతుర్యంతో సెటైర్లతో ఆయన అల్లలాడించగలరు.
By: Tupaki Desk | 18 Feb 2025 9:37 AM ISTఆయన మాటలలో వేడి వాడి ఉంటుంది. మంచి భాషతో పాటు చమత్కారాలు వాడతారు ప్రత్యర్ధులను తనదైన వాక్చాతుర్యంతో సెటైర్లతో ఆయన అల్లలాడించగలరు. ఆయన పూర్వాశ్రమంలో మాస్టారు కావడం వల్ల రాజకీయాల్లోనూ ఆయన ఒక విధంగా ఆ గురు పరంపరను కొనసాగించారని చెప్పాలి. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు గురించి ఇపుడు ఒక రకమైన చర్చ సాగుతోంది. మాస్టారు మౌన ముద్ర దాల్చారు అన్నదే ఆ చర్చ.
ఎంతో రాజకీయ అనుభవం కలిగి ప్రతిభా పాటవాలు కూడా ఉన్న నాయకుడు దాడి. ఆయన 1985లో టీడీపీలో చేరారు. ఆ వెంటనే ఎమ్మెల్యే అయిపోయారు. 2004 దాకా అంటే ఇరవయ్యేళ్ళ పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా కీలక పదవులు నిర్వహించారు. 2006 నుంచి 2012దాకా శాసనమండలిలో ఎమ్మెల్సీగా కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రతిపక్ష నేతగా కూడా దాడి పనిచేశారు.
అయితే రెండోసారి తనను ఎమ్మెల్సీగా చేయలేదన్న బాధతో ఆయన ఒకే ఒక్క తప్పటడుగు వేశారు. నాడు జైలులో ఉన్న జగన్ ని కలసి వైసీపీలో చేరిపోయారు. 2014లో కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారు కానీ ఓటమి పాలు అయ్యారు. ఇక అక్కడే ఉన్నా బాగుండేది. కానీ నిలకడ లేని రాజకీయం తో వైసీపీని వీడి బయటకు వచ్చారు మళ్ళీ టీడీపీలో చేరేందుకు చూశారు.
తీరా 2019 ఎన్నికల వేళ వైసీపీ వేవ్ చూసి అందులో మరోసారి చేరారు. కానీ ఈసారి జగన్ టికెట్ ఇవ్వలేదు. అంతే కాదు పార్టీ అధికారంలోకి వచ్చినా అయిదేళ్ళ పాటు ఏ నామినేటెడ్ పదవినీ ఇవ్వలేదు. దాంతో తీవ్ర ఆగ్రహం అసంతృప్తితో ఆయన 2024 ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకుని టీడీపీ మెంబర్ అయ్యారు.
ఆనాడు ఆయన తన కుమారుడికి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అని అంటారు. అది దక్కలేదు అయితే గడచిన ఎనిమిది నెలలలో అనేక నామినేటెడ్ పదవుల పందేరం సాగినా ఆయనకు కానీ కుమారుడికి కానీ అవకాశం దక్కలేదు. దాంతో ఆయనలో మళ్ళీ అసంతృప్తి రాజుకుంటోందని అంటున్నారు.
2012 నుంచి అటూ ఇటూ పార్టీలు మారుస్తూ రాజకీయంగా నిలకడ లేకుండా పోవడం వల్లనే ఆయనకు ఈ విధంగా జరుగుతోంది అని అంటున్నారు. దాడి 2012లో టీడీపీని వదిలేశారు అలా అనకాపల్లి రాజకీయాల్లోకి కొత్త వారు వచ్చేశారు. ఇపుడు అంతా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హవా సాగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ పొత్తులో జనసేనకు వెళ్ళింది. దాంతో కీలకమైన నామినేటెడ్ పదవి పీలాకు దక్కింది. అంతే కాదు 2029లో పార్టీ టికెట్ హామీ కూడా ఆయనకే దక్కింది అని టాక్.
అదే సామాజిక వర్గానికి చెందిన దాడి కుటుంబానికి నామినేటెడ్ పదవి కూడా దక్కకపోవడానికి కులమే ఒక మైనస్ అని అంటున్నారు దానికి తోడు పార్టీలు మారుస్తూ స్థానికంగా దాడి కుటుంబం తమ సొంత అనుచర బలాన్ని కోల్పోయింది అని కూడా అంటున్నారు ఇక దాడి ఫ్యామిలీకి పదవులు ఇవ్వకుండా లోకల్ టీడీపీ వర్గాలే అడ్డుకుంటున్నాయని అంటున్నారు.
ఈ విధంగా రాజకీయంగా ఎటూ కలసిరాకపోవడంతో దాడి వీరభద్రరావు మాస్టారు మౌనమే నా భాష అని సైలెంట్ అయ్యారని అంటున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. ఎంతో మంది నేతలు ఉన్నారు. సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారిని తీసుకోవాలని పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో పాత నీరు అలా పక్కకు పోతోంది అని అంటున్నారు. దాంతోనే చాలా మంది పార్టీ సీనియర్లు అన్న ముద్రతో కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తోంది అని అంటున్నారు.