Begin typing your search above and press return to search.

దాడి ఫ్యామిలీని దూరం పెట్టి...వారందరికీ పదవులు...?

విశాఖ జిల్లా అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీని వైసీపీలో దూరం పెడుతున్నారా అంటే అదే జరుగుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 3:45 AM GMT
దాడి ఫ్యామిలీని దూరం పెట్టి...వారందరికీ పదవులు...?
X

విశాఖ జిల్లా అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీని వైసీపీలో దూరం పెడుతున్నారా అంటే అదే జరుగుతోంది అని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం రెండవసారి ముచ్చట పడి మరీ దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు రత్నాకర్ వైసీపీ కండువా జగన్ సమక్షంలో కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ దక్కలేదు. ఆ తరువాత పార్టీ అధికారంలోకి వచ్చినా నామినేటెడ్ పదవులు దక్కలేదు.

పెద్దాయన దాడి తనకు ఎమ్మెల్సీ, తన కుమారుడికి మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతాయని ఆశించారని ప్రచారంలో ఉంది. అయితే అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ మధ్యలో అడ్డుపడి ఏ పదవులూ ఆ ఫ్యామిలీకి దక్కకుండా చేస్తున్నారు అని ప్రచారం అయితే ఉంది. ఇక దాడి ఫ్యామిలీ వైసీపీలో ఒక వైపు గట్టిగా నలిగిపోతోంది.

అదే సమయంలో వేరే పార్టీలోకి వెళ్లే దారి లేక సతమతం అవుతోంది. ఈ నేపధ్యంలో తమకు పదవులు దక్కకపోయినా ఇతర వర్గాలను తెచ్చి మరీ పదవులు ఇవ్వడం పుండు మీద కారం రాసినట్లే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కి విశాఖ పశ్చిమ టికెట్ కన్ ఫర్మ్ అయింది. దాంతో పాటు నామినేటెడ్ పదవి కూడా వరించింది.

అలాగే ఇపుడు సీనియర్ మోస్ట్ లీడర్ దంతులూరి దిలీప్ కుమార్ కి జగన్ పిలిచి మరీ కీలకమైన నామినేటెడ్ పదవి కట్టబెట్టారు.ఆయనను ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ బోర్డు (ఆఫీవా) చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర జారీ చేసింది. దిలీప్ కుమార్ రెండేళ్ల పాటు ఈ పదవులు ఆయన ఉంటారు. దంతులూరి దిలీప్ కుమార్ 1990 దశకం నాటి రాజకీయ నాయకుడు. ఆయన పలు మార్లు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు.చట్ట సభలకు వెళ్లకుండా ఆయన రాజకీయ జీవితం సాగింది.

ఒక విధంగా చూస్తే పోరాట యోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి దిలీప్ కుమార్ కి జనంలో మంచి పేరు ఉంది. ఎన్నికల వేళ ఆయనను దగ్గరకు తీయడం ద్వారా అనకాపల్లిలో వైసీపీ బలోపేతం కావాలని చూస్తోంది. అదే టైంలో దాడి ఫ్యామిలీ అలిగి దూరంగా ఉందన్న వార్తలను సైతం అధినాయకత్వం పట్టించుకోవడం లేదా అన్నది చర్చకు వస్తోంది.

ఈసారి దాడి ఫ్యామిలీ అండ లేకుండానే గెలవాలని వైసీపీ యువ నేత, మంత్రి గుడివాడ వ్యూహాలు రచిస్తున్నారని, అందులో భాగమే కీలక నేతలకు పదవులు ఇప్పించుకుంటున్నారని అంటున్నారు. మరి దాడి ఫ్యామిలీ ఏమి చేస్తుంది అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. చూడాలి మరి ఏమి జరుగుతుందో.