Begin typing your search above and press return to search.

అనకాపల్లి సీటు మీద దాడి కర్చీఫ్ ...!?

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు ఈసారి తామే పోటీకి అని చెప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:45 AM GMT
అనకాపల్లి సీటు మీద దాడి కర్చీఫ్ ...!?
X

అసలే ఒక సీటు కోసం ఇద్దరు ఒకే పార్టీలో సిగపట్లు పడుతున్న పరిస్థితి అనకాపల్లి టీడీపీలో ఉంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు ఈసారి తామే పోటీకి అని చెప్పుకుంటున్నారు. వారి అనుచరులు కూడా అలాగే ప్రచారం చేస్తున్నారు.

తాను లోకల్ అని తనకు టికెట్ ఇవ్వాలని నాగ జగదీశ్వరరావు హై కమాండ్ ని కోరారు. పెందుర్తి నుంచి వచ్చిన పీలాకు అనకాపల్లి టికెట్ ఏమిటి అని సొంత పార్టీలో ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు టికెట్ ఆయనకే ఇచ్చారు కాబట్టి ఈ దఫా తనకే అని నాగ జగదీశ్వరరావు అంటున్నారు. ఆయన మద్దతుదారులూ అదే వాదనను బలంగా వినిపిస్తున్నారు.

ఇపుడు ఈ పోటీలోకి కొత్తగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ వచ్చి చేరారు. ఆయన నిన్నటిదాకా వైసీపీలో ఉన్నారు. ఇపుడు టీడీపీలోకి వచ్చారు. టికెట్ కోసమే ఇలా వచ్చారు అని అంటున్నారు. వైసీపీలో టికెట్ మలసాల భరత్ కుమార్ కి ప్రకటించింది ఆ పార్టీ అధినాయకత్వం.

దాంతో ఇక అక్కడ చాన్స్ లేదని దాడి ఫ్యామిలీ మళ్లీ సైకిలెక్కేసింది. సీనియర్ దాడి చంద్రబాబుని ఆయన కుమారుడు జూనియర్ దాడి లోకేష్ ని పొగుడుతున్నారు. లోకేష్ అనకాపల్లిలో నిర్వహించే శంఖారావం సభ విషయంలో దాడి రత్నాకర్ ముందుండి చొరవ చూపుతున్నారు. అన్నింటా తానే అవుతున్నారు.

ఇదంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసమే అని అంటున్నారు. ఎటూ ఇద్దరు సీనియర్ నేతలు పోట్లాడుకుంటున్నారు. కాబట్టి మధ్యలో వచ్చిన దాడి ఫ్యామిలీకి టికెట్ ఇస్తే పోలా అన్న ఆలోచనలు హై కమాండ్ కి కలుగ చేయాలన్నదే ఉద్దేశ్యంగా ఉంది. అయితే ఈ టికెట్ కోసం భీకరమైన పోరు టీడీపీలో సాగుతున్న నేపధ్యంలో ఇటీవలే మళ్ళీ టీడీపీలోకి వచ్చిన దాడి రత్నాకర్ కి టికెట్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.

అయిదేళ్ల పాటు అధికార పార్టీలో ఉంటూ ఎన్నికల వేళ అటు నుంచి ఇటు వస్తే టికెట్ ఇస్తే అది తమ్ముళ్లకు ఏ రకమైన సంకేతం ఇస్తుంది అన్న ప్రశ్నలూ ఉన్నాయి. అయితే టికెట్ హామీతోనే దాడి కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిందని అంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే పీలాకు మూడవసారి టికెట్ ఇవ్వమని చెప్పడంతో పాటు మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావుకు మరోసారి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇస్తూ దాడి రత్నాకర్ కి టికెట్ ఇచ్చే వీలుందని అంటున్నారు. సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఇపుడు ఈ విధంగా పూర్తిస్థాయిలో వాడుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా అనకాపల్లి టికెట్ దక్కించుకుంటే కనుక దాడి ఫ్యామిలీ ఘన విజయం సాధించినట్లే అని అంటున్నారు.