అవును.. కాకినాడ సెజ్ లో 6 ఎకరాలు కొన్నా.. దాడిశెట్టి రాజా లెక్కే వేరు
కాకినాడ సెజ్ లో తాను ఆరు ఎకరాలు కొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం అబద్ధం కాదన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..
By: Tupaki Desk | 7 Dec 2024 4:54 AM GMTఏమైనా కొందరు నేతల తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. విమర్శలు వెల్లువెత్తే వేళలోనూ అంతే నిర్బయంగా మాట్లాడటం కొందరు నేతలకు సాధ్యమవుతుంది. ఆ కోవలోకే వస్తారు వైసీపీ కీలక నేతల్లో ఒకరైన దాడిశెట్టి రాజా. కాకినాడ సెజ్ లో ఆయన భూములు కొన్నారన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. కాకినాడ సెజ్ లో తాను ఆరు ఎకరాలు కొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం అబద్ధం కాదన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..
‘‘అవును.. కాకినాడ సెజ్ లో 6 ఎకరాలు కొన్నాను. మార్కెట్ రేటు కంటే ఎక్కువే డబ్బులు చెల్లించి రైతుల నుంచి భూమిని కొనుగోలు చేశాను’’ అంటూ ఓపెన్ అయ్యారు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని.. తాను కొనుక్కున్న విషయాన్ని ధైర్యంగా చెబుతానన్న ఆయన.. ‘‘ఏ రైతు అయినా సరే మీ దగ్గరకు వచ్చి నా భూమిని తక్కువ ధరకు కొన్నట్లు చెప్పారా? ఎవరైనా ఫిర్యాదు చేశారా? అలాంటిదేమీ లేదు. దశాబ్దాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నాం. అలా వచ్చిన డబ్బుతో ఆస్తులు కొంటున్నాం’’ అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
తాను కొన్న భూముల గురించి లెక్క చెప్పిన దాడిశెట్టి అదే సమయంలో మరో ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. రాజధానిలో చంద్రబాబు భూమి కొన్నారని.. ఆ మధ్యన పవన్ కల్యాణ్ పిఠాపురంలో పదహారు ఎకరాలు కొనుక్కున్నారని చెబుతూ.. ‘పది రోజుల క్రితం యనమల రామక్రిష్ణుడు రెండు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అవన్నీ ప్రజల దగ్గర దోచుకు తిన్నవేనని.. వారి దగ్గర లాక్కున్నవే అని నేనంటే.. నిజమైపోతుందా?’’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఆస్తుల కొనుగోలు గురించి మాట్లాడుతున్న దాడిశెట్టి.. ఒకపాయింట్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. వారిద్దరూ తాము భూములు కొన్నంతనే.. ఆ వివరాల్నిప్రజలకు వెల్లడించారు. దాడిశెట్టి మాదిరి దాచి పెట్టలేదు. పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వచ్చిన తర్వాత మాత్రమే మీడియాకు వివరాలు చెబుతూ.. ప్రజలకు చేరేలా చేస్తున్నారు. అలాంటప్పుడు వారితో తనను పోల్చుకోవటంలో అర్థమేంది? అన్నది ఆయనకే తెలియాలి.