Begin typing your search above and press return to search.

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి...!

వైసీపీకి అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు

By:  Tupaki Desk   |   2 Jan 2024 10:48 AM GMT
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి...!
X

వైసీపీకి అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదని కారణంతోనే పార్టీకి ఆయన గుడ్ బై కొట్టారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ కి పంపించారు. అలాగే విజయసాయిరెడ్డికి సజ్జల రామక్రిష్ణారెడ్డికి కూడా పంపించారు.

ఇదిలా ఉంటే దాడి వైసీపీలో రెండు సార్లు చేరారు. రెండు సార్లూ రాజీనామా చేసి బయటకు వచ్చారు. దాడి వీరభద్రరావు తమ కుమారుడు దాడి రత్నాకర్ రాజకీయ భవితవ్యం దృష్టిలో పెట్టుకుని వైసీపీలో చేరారు. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ దాడి కుటుంబానికి రాదని తేలిపోయింది అని అంటున్నారు. సెకండ్ లిస్ట్ బయటకు రాలేదు కానీ కచ్చితంగా దాడి ఫ్యామిలీకి అయితే టికెట్ ఇవ్వరని తెలుస్తోంది అని అంటున్నారు.

దాంతోనే దాడి పార్టీని వీడారు అని అంటున్నారు. దీని కంటే ముందు ఆయన 2012లో వైసీపీలో తొలిసారి చేరారు. ఆనాడు ఆయన హైదరాబాద్ చంచల్ గూడా జైలుకు వెళ్ళి మరీ జగన్ ని కలసి వచ్చారు. ఆ తరువాత ఆయన పార్టీలో చేరారు. 2014లో దాడి కుమారుడు రత్నాకర్ కి విశాఖ పశ్చిమం టికెట్ ని జగన్ కేటాయించారు. అయితే ఆయన అప్పట్లో ఓటమి పాలు అయ్యారు. వైసీపీ కూడా ఏపీలో ఓడింది.

ఆ తరువాత కొద్ది రోజులకే దాడి కుటుంబం వైసీపీని వీడింది. ఆ మధ్యలో తిరిగి తెలుగుదేశం పార్టీలోకి దాడి చేరుతారు అని ప్రచారం సాగింది. అయితే అది కుదరలేదు. 2019 ఎన్నికలకు ముందు దాడి మళ్లీ వైసీపీలోకి వచ్చి చేరారు అనాడు ఆయన అనకాపల్లి టికెట్ ని కోరుకున్నారు. కానీ అప్పటికే గుడివాడ అమర్నాథ్ కి ఆ టికెట్ కేటాయించడం వల్ల వైసీపీ హై కమాండ్ ఇవ్వలేకపోయింది.

ఈ మధ్యలో ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులను కూడా దాడి ఆశించారు అని అంటారు. అయితే అవి దక్కకపోవడం కూడా ఆయనలో అసంతృప్తికి కారణం అయ్యాయని అంటారు. వీటికి తోడు మంత్రి గుడివాడ దాడికి మధ్య విభేదాలు ఉన్నాయి. దాడి ఏదో రోజున పార్టీ వీడుతారు అని అంతా అనుకున్నదే అని వైసీపీలో వినిపిస్తున్న మాట. ఇపుడు ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నదే చర్చగా ఉంది.