మాజీ మంత్రి దాడి మారిన పార్టీలెన్నో...!?
అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మరోసారి పార్టీ మారుతున్నారు. ఆయన పార్టీ మారడం అన్నది గత పదేళ్లలో ఇది ఎన్నో సారో అని రాజకీయ పరిశీలకులు లెక్క వేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 3 Jan 2024 3:45 AM GMTఅనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మరోసారి పార్టీ మారుతున్నారు. ఆయన పార్టీ మారడం అన్నది గత పదేళ్లలో ఇది ఎన్నో సారో అని రాజకీయ పరిశీలకులు లెక్క వేసుకుంటున్నారు. 2012 ప్రాంతంలో ఆయన తొలిసారి టీడీపీ నుంచి వైసీపీలోకి మారిపోయారు. 2014లో ఆ పార్టీ తరఫున తన కుమారుడికి టికెట్ ఇప్పించుకుని పోటీ చేసినా ఓటమి వరించింది.
అంతే వైసీపీని ఆ వెంటనే వదిలేశారు. తిరిగి టీడీపీ వైపు జరిగారు. అయితే టీడీపీ అయిదేళ్ల అధికారంలో కూడా దాడికి ఏ అవకాశం దక్కలేదు. దాంతో 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి చేరారు. అయితే టికెట్ అక్కడా దక్కలేదు. అయిదేళ్ల పాటు అసంతృప్తితోనే వైసీపీలో దాడి గడిపారు. తీరా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టికెట్ ఇక రాదు అని తేలిపోయిన వేళ పార్టీ మారుతున్నారు.
తిరిగి టీడీపీలోకి ఆయన వెళ్తున్నారు. ఇలా కనుక చూస్తే ఈ మధ్య కాలంలో రెండు సార్లు టీడీఎపీ రెండు సార్లు వైసీపీ అని తిరిగి మళ్లీ టీడీపీ గూటికే దాడి చేరుతున్నారు అని అంటున్నారు. ఈ మధ్యలో ఆయన జనసేనలో కూడా చేరుతారని వార్తలు వచ్చాయి.
దాడి టీడీపీలో చేరినా టికెట్ మాత్రం దక్కే అవకాశాలు లేవు అనే అంటున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ బలమైన అభ్యర్ధిగా ఉన్నారు. ఆయనకే టికెట్ లభిస్తుంది అని అంటున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏదైనా నామినేటెడ్ పదవి దాడికి కానీ కుమారుడికి కానీ దక్కవచ్చు అన్న హామీతోనే సైకిల్ ఎక్కుతారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే దాడి రాజకీయ వైభోగం అంతా గత కాలానిదే అని అంటున్నారు. ఇపుడు అంతా కొత్త జనరేషన్ వచ్చేసింది. అనకాపల్లిలో అక్కడక్కడ బలం ఉన్నా ఓవరాల్ గా ప్రజెంట్ జనరేషన్ ని తట్టుకుని నిలబడగలరా అని చూసి మాత్రమే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి.
అంగబలం అర్ధబలంతో పాటు దూకుడు చేసే రాజకీయ నేతలకే చోటు కల్పిస్తున్నారు. దాటి వీరభద్రరావు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఆయన పార్టీ మార్పును చూసిన వారు ఇపుడు ఇది అవసరమా అని అనుకోవచ్చు. కానీ తన రాజకీయ వారసుడిగా కుమారుడికి చాన్స్ కోసమే పెద్దాయన తాపత్రయం అని అంటున్నారు.
ఏది ఏమైనా చంద్రబాబు సైతం దాడిని ఆదరించే అవకాశాలు ఎంతమేరకు ఉంటాయన్నదే ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలను అలా మార్చేయడమే కాదు అక్కడ ఉంటే జగన్ని ఇక్కడ ఉంటే చంద్రబాబుని గట్టిగానే విమర్శించి ఎటూ కాకుండా పోతున్నారు అన్న మాట అయితే ఉంది. ఎనభైలు తొంబైలలో జోరుగా సాగిన దాడి రాజకీయం ఇపుడు అదే స్పీడ్ అందుకుంటుందా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.