Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు లోకేష్ తోనే ఇబ్బంది...దగ్గుబాటి చలోక్తి !

విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్టీఆర్ ఇద్దరు తోడల్లుళ్ళూ కలసి కనిపించారు, కౌగిలించుకున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2025 3:58 PM IST
చంద్రబాబుకు లోకేష్ తోనే ఇబ్బంది...దగ్గుబాటి చలోక్తి !
X

విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్టీఆర్ ఇద్దరు తోడల్లుళ్ళూ కలసి కనిపించారు, కౌగిలించుకున్నారు. నవ్వులు పంచుకున్నారు. ఇదిలా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకంలో కేవలం చరిత్రలో ఉన్న అంశాలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా ప్రస్తావించినట్లుగా చెప్పారు.

అలా భవిష్యత్తు దర్శనం కూడా ఈ పుస్తకంలో ఉందని అన్నారు. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎలా కొత్త పుంతలు తొక్కుతుందో కూడా తన పుస్తకంలో వివరించినట్లుగా దగ్గుబాటి చెప్పారు. ఏఐ వచ్చాక జరిగే మార్పులు కూడా అందులో ఉన్నాయని అన్నారు.

ఇక మానవ మెదడులో నిక్షిప్తం చేసే అనేక అంశాలను భావి తరాలను ఈ దేహం విడిచాక కూడా సురక్షితంగా ఎలా అందించవచ్చు అన్నది కూడా సాంకేతిక విజ్ఞానం ద్వారా తెలుస్తుంది అన్నారు. అలాగే కంటికి ఒక చిప్ పెట్టుకుంటే చాలు ఎన్ని వేల పేజీలను అయినా ఒకేసారి చదివేసి బుర్రకెక్కిస్తుందని, దానిని అక్కడ మెదడులోని డేటాలో నిక్షిప్తం చేస్తుందని ఆయన చెప్పారు. మళ్ళీ అవసరం అయినపుడు అది అంతా గుర్తుకు వచ్చేలా కొత్త టెక్నాలజీ రాబోతోంది అన్నారు.

ఇదే సమయంలో రానున్న అయిదేళ్లలో వచ్చే మరో సాంకేతిక అభివృద్ధిని గురించి ఆయన చెబుతూ మనిషి మరో యాభై ఏళ్ళు అదననంగా ఆరోగ్యంగా జీవించే విధంగా సరికొత్త టెక్నాలజీ అప్పటికి అందుబాటులోకి వస్తుందని దగ్గుబాటి చెప్పారు. ఇది సైన్స్ సాధిస్తున్న మరో విజయం అన్నారు.

మనిషి ఆయుష్షు బాగా పెంచే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని దాంతో సులువుగా ఇప్పటి జీవితానికి కలుపుకుని మరో యాభై ఏళ్ళు ఎక్కువాగా బతికేందుకు ప్రతీ ఒక్కరికీ చాన్స్ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ ఈ రకమైన టెక్నాలజీ వల్ల బాబు మరో యాభై ఏళ్ళు ఆరోగ్యంగా జీవించేందుకు కూడా అవకాశం ఆస్కారం ఉందని అన్నారు. అయితే వచ్చిన చిక్కల్లా వారి అబ్బాయితోనే అని అన్నారు

బాబు మరింత ఆరోగ్యంగా ఉత్సాహంగా పనిచేస్తే లోకేష్ కే ఇబ్బంది అన్నట్లుగా దగ్గుబాటి చలోక్తి విసిరారు. అదెలా అన్నదే చర్చగా ఉంది. లోకేష్ రేపటి సీఎం గా ప్రొజెక్ట్ అవుతున్నారు. బాబు ఎపుడు రిటైర్ అయితే అపుడు ఆయన పీఠం అందుకుంటారని ప్రచారంలో ఉంది. మరి అదే బాబు ఇంకా నిత్య నూతనంతో మరో యాభై ఏళ్ళు ఇదే దూకుడుతో పనిచేస్తే కనుక కచ్చితంగా ఆయన సీఎం గా ఉంటారు అన్నది తెలిసిందే. అందుకే దగ్గుబాటి లోకేష్ కి చాన్స్ ఆ విధంగా చూస్తే రాదు అన్నట్లుగా మీ అబ్బాయికే ఇబ్బంది బాబూ అన్నరు. దాంతో దగ్గుబాటి మాటలకు చంద్రబాబు కూడా ముసిముసినవ్వులు చిందించారు.