చిన్నమ్మ కూడా చేతులెత్తేసినట్టేనా?
ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ పొత్తు పుణ్యమాని బీజేపీ జాక్ పాట్ కొట్టింది.
By: Tupaki Desk | 17 Sep 2024 2:30 PM GMTఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ పొత్తు పుణ్యమాని బీజేపీ జాక్ పాట్ కొట్టింది. 8 అసెంబ్లీ స్థానాలను గెలవడంతోపాటు 3 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, శ్రీనివాసవర్మ, సీఎం రమేశ్ ఎంపీలుగా విజయం సాధించారు. వీరిలో సీఎం రమేశ్, పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవులను ఆశించారు. అయితే విచిత్రంగా వీరిద్దరికి కాకుండా మొదటిసారి ఎంపీగా గెలిచిన శ్రీనివాసవర్మకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది.
మరోవైపు మొదటి నుంచి బీజేపీలో ఉంటూ ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్న సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్థన్ రెడ్డి వంటి నేతలకు అసెంబ్లీ సీట్లూ దక్కలేదు..ఎంపీ సీట్లూ లభించలేదు. దీంతో వీరు పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్నారని చెబుతున్నారు. ఈ ప్రభావం తాజాగా పార్టీ సభ్యత్వ చేరికలపైన పడిందని టాక్ నడుస్తోంది.
ఈ ఏడాది కనీసం లక్ష మందిని పార్టీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. దీంతో సభ్యత్వ రుసుం కింద రూ.200 పెట్టారు. పురందేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే పెద్దగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. దీనికి ముందే టీడీపీ, జనసేన పార్టీలు సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించాయి. వీటికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. టీడీపీ ఉచితంగానే సభ్యత్వాన్ని తీసుకునే అవకాశాల్ని కల్పించింది. మరోవైపు జనసేన రూ.500 రుసుం పెట్టింది. అయినప్పటికీ భారీగానే టీడీపీ, జనసేనల్లో సభ్యత్వాలు పెరిగాయి,
కానీ బీజేపీ మాత్రం తమ పార్టీలో సభ్యులను చేర్చుకోవడంపై వెనుకబడిందని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ సభ్యత్వ నమోదు ఆశించినంతగా జరగలేదని తెలుస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉంటూ కోర్ బీజేపీ నేతలుగా ఉన్నవారు పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, అంతా పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి కనుసన్నల్లోనే నడుస్తోందని చిన్నబుచ్చుకున్నట్టు చెబుతున్నారు.
మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలెవరూ పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించలేదని, తమకు సంబంధం లేని వ్యవహారమని వదిలేశారని అందుకే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంతగా విజయవంతం కాలేదని అంటున్నారు. ఇక వేరే పార్టీల్లో ఉండి బీజేపీలో చేరిన నేతలు అసలే ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదని చెబుతున్నారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని తర్వాత వదిలేశారని అంటున్నారు. దీంతో బీజేపీ సభ్యత్వాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని టాక్ నడుస్తోంది.