Begin typing your search above and press return to search.

లిక్కర్ అమ్మకాలపై శ్వేతపత్రం ఇవ్వాలి... పురందేశ్వరి కొత్తడిమాండ్!

అవును... ఆంధ్రప్రదేశ్‌ లో మద్యం విక్రయాలు, మద్యం ఇండెంట్లు, మద్యం కంపెనీల సరఫరా మొత్తం తాడేపల్లి కనుసన్నల్లో జరుగుతున్నాయంటూ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు

By:  Tupaki Desk   |   21 Sep 2023 6:38 AM GMT
లిక్కర్ అమ్మకాలపై శ్వేతపత్రం ఇవ్వాలి... పురందేశ్వరి కొత్తడిమాండ్!
X

గతకొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కిపెడుతున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారు. రాష్ట్రం మొత్తం అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. ఫలితంగా భారీ కుంభకోణం జరుగుతుందని ఆమె ఆరోపించారు!

అవును... ఆంధ్రప్రదేశ్‌ లో మద్యం విక్రయాలు, మద్యం ఇండెంట్లు, మద్యం కంపెనీల సరఫరా మొత్తం తాడేపల్లి కనుసన్నల్లో జరుగుతున్నాయంటూ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 15శాతం మద్యం సేవిస్తారని ఆమె చెబుతున్నారు.

ఇదే సమయంలో... కేంద్రం అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 80లక్షల మంది మద్యం సేవిస్తారని, వారు సరాసరిన రోజుకు రూ.200 రుపాయల మద్యం సేవిస్తారని అనుకుంటే.. వాటి ద్వారా డైలీ రూ.160కోట్లు వస్తాయని అన్నారు. ఈ లెక్కన చూసుకుంటే... నెలకు రూ.4800 కోట్లు అని.. ఇక ఏడాదికి రూ.57,600కోట్లు వస్తాయని చెబుతున్నారు!

అయితే... రాష్ట్ర బడ్జెట్‌ లో మాత్రం మధ్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయం 20వేల కోట్ల రుపాయలు మాత్రమే అంటూ లెక్కలు చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూసుకుంటే... మిగిలిన రూ. 37,600 కోట్లు ఎటుపోతున్నాయని పురందేశ్వరి ప్రశ్నించారు. ఈ లెక్కలపై ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె కోరారు.

ఈ లెక్కన చూసుకుంటే... రాష్ట్రంలో మద్యం విక్రయాలకు మించిన కుంభకోణం మరొకటి ఉండదని పురందేశ్వరి తెలిపారు.

ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై ఎదురైన ప్రశ్నలపైనా పురందేశ్వరి స్పందించారు. అవినీతి ఎవరు చేసినా శిక్షించాలనే చెబుతున్నామని అన్నారు. అయితే... స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందో లేదో చెప్పడానికి తాము ఎవరమని ప్రశ్నించారు. అది రేపు కోర్టులో వాదనల అనంతరం న్యాయమూర్తి నిర్ణయిస్తారన్నారని తెలిపారు.

అయితే... సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో చేసిందా లేదా అనే అనుమానం మాత్రం తమకు ఉందని పురందేశ్వరి చెప్పడం గమనార్హం!