Begin typing your search above and press return to search.

చిన్నమ్మ ఢిల్లీ టూర్ తో పొత్తులపై ఫుల్ క్లారిటీ

ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతోనూ.. పొత్తులపై మాట్లాడతానని.. 2014 కాంబినేషన్ లో ఎన్నికల బరిలోకి దిగాలని తాను కోరుతానని చెప్పటం తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Oct 2023 5:06 AM GMT
చిన్నమ్మ ఢిల్లీ టూర్ తో పొత్తులపై ఫుల్ క్లారిటీ
X

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో ఆర్నెల్ల తర్వాతే. కానీ.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. రాజకీయ వేడి చూసినప్పుడు.. తెలంగాణలో మాదిరి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన భావన కలుగక మానదు. ఏపీ బీజేపీ రథసారధి పురందేశ్వరి అలియాస్ చిన్నమ్మ హస్తిన టూర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కారణం.. ఈ టూర్ తో ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉండటం.. ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్.. జైలు బయట ఆవరణతోనే పొత్తులపై క్లారిటీ ఇచ్చేయటం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు.. జగన్ ను అధికారం నుంచి దించేసేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లుగా స్పస్టత ఇచ్చేశారు.

ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతోనూ.. పొత్తులపై మాట్లాడతానని.. 2014 కాంబినేషన్ లో ఎన్నికల బరిలోకి దిగాలని తాను కోరుతానని చెప్పటం తెలిసిందే. దీనిపై బీజేపీ అధినాయకత్వం ఆలోచన ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇటీవల ఏపీలో జరిగిన పార్టీ కీలక భేటీలోనూ పొత్తులపైనే పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ బీజేపీ బాధ్యురాలు పురంధేశ్వరికి వెంటనే ఢిల్లీకి రావాలన్న కబురు అందటంతో.. ఆమె హుటాహుటిన దేశ రాజధానికి ప్రయాణమయ్యారు.

తాజాగా ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యే చిన్నమ్మ.. రాష్ట్రానికి తిరిగి వచ్చే సమయానికి పొత్తులపై లెక్కలు తేల్చుకొని వస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు.. జనసేనాని సైతం ఢిల్లీ టూర్ పెట్టుకున్న వేళ.. పురంధేశ్వరి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత.. ఢిల్లీకి వెళ్లే పవన్.. ఏపీలో పొత్తుల లెక్కపై మరింత స్పష్టత తీసుకొస్తారన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మోడీ సర్కారులోని కీలక నేతలతో భేటీ కావటం.. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై బీజేపీ అధినాయకత్వం ఇరుకున పడిందన్న మాట వినిపిస్తోంది. మరి.. పవన్ కోరుకున్నట్లుగా 2014లో ఏపీలో పొత్తుల సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా? లేదా? బీజేపీ అధినాయకత్వం మైండ్ సెట్ ఏలా ఉందన్న దానిపై క్లారిటీ రావటం ఖాయమని చెప్పక తప్పదు.