Begin typing your search above and press return to search.

దగ్గిబాటి పురంధేశ్వరి టీడీపీకి ప్రోక్సీనా...?

ఆమె బీజేపీ వంటి జాతీయ పార్టీకి ప్రెసిడెంట్. బీజేపీ ఆషామాషీ పార్టీ కానే కాదు, కేంద్రంలో గత తొమ్మిదిన్నరేళ్ళుగా అధికారాన్ని పూర్తి స్థాయిలో చలాయిస్తున్న పార్టీ

By:  Tupaki Desk   |   26 Oct 2023 8:38 AM GMT
దగ్గిబాటి పురంధేశ్వరి టీడీపీకి ప్రోక్సీనా...?
X

ఆమె బీజేపీ వంటి జాతీయ పార్టీకి ప్రెసిడెంట్. బీజేపీ ఆషామాషీ పార్టీ కానే కాదు, కేంద్రంలో గత తొమ్మిదిన్నరేళ్ళుగా అధికారాన్ని పూర్తి స్థాయిలో చలాయిస్తున్న పార్టీ. అటువంటి పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి సొంత పార్టీని గడచిన కొద్ది నెలలుగా ఏమి అభివృద్ధి చేస్తున్నారు. ఆమె నాయకత్వంలో బీజేపీకి కొత్త వెలుగులు ఏమి వచ్చాయి అన్న ప్రశ్నలు వేసుకుంటే జవాబు నీరసంగానే వస్తోంది.

అదే టైం లో ఆమె మీద ఒక బలమైన ముద్ర పడిపోతోంది. ఆమె టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని. ఇప్పటిదాకా బీజేపీకి ఎవరు ప్రెసిడెంట్లు అయినా ఇంతలా నింద మోయలేదు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరికి అది తొందరగానే వచ్చేసింది. దానికి కాలం పరిస్థితులు, రాజకీయాలతో పాటు నందమూరి బంధం కూడా తోడు అయితే కావచ్చు. సరిగ్గా ఇలాంటి టైం లోనే ఆమె మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాలి.

తన తండ్రి స్థాపించిన టీడీపీ ఏపీలో కీలకంగా ఉన్న వేళ, తన మరిది నాయకత్వంలో పార్టీ ఉన్న వేళ తాను ఇటు వైపు ఉన్నపుడు చేసే రాజకీయం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. జనాల సంగతి పక్కన పెడితే కనీసం సొంత పార్టీ వారు అయినా నమ్మేలా వారి విశ్వాసం చూరగొనేలా రాజకీయం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పురంధేశ్వరి పూర్తిగా విఫలం చెందారనే అంటున్నారు.

అందుకే ఆమె మీద టీడీపీ కి సన్నిహితం అన్న ముద్ర ఒకటి పడిపోయింది అని అంటున్నారు. ఇక టీడీపీకి పురంధేశ్వరి ప్రోక్సీనా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ప్రోక్సీ అంటే ఒకరి చేయాల్సిన పని వేరే వాళ్లు చేసి పెట్టడం. అలా టీడీపీ పనులను బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆ పలుకుబడిని రాజకీయాన్ని ఉపయోగించుకుని పురంధేశ్వరి చేస్తున్నారు అని బీజేపీలోనే టాక్ ఉందని అంటున్నారు.

అలా పురంధేశ్వరి టీడీపీ మేలు కోసమే ఇప్పటిదాకా పనిచేస్తున్నారని అంటున్నారు. నారా లోకేష్ కి అమిత్ షాతో తో భేటీ వేయించడంలోనూ పురంధేశ్వరి కీలకమైన పాత్ర పోషించారని అంటున్నారు. ఏపీలో టీడీపీ గొంతు పెద్దగా లేని చోట బలంగా పలకని చోట చతికిలపడిన చోట తాను ఉన్నాను అని పురంధేశ్వరి ఆయా పనులను భుజాలకెత్తుకుని పనిచేస్తున్నారు అని అంటున్నారు.

అలా ఏపీలో టీడీపీని నిలబెట్టడం కోసం పనిగట్టుకుని పురంధేశ్వరి చేస్తున్న ప్రయత్నాల మీద జనం ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది పక్కన పెడితే బీజేపీలోని మెజారిటీ సెక్షన్ మాత్రం పూర్తి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఎంతలా బంధాలు ఉన్నా మరే రకమైన సాన్నిహిత్యాలు ఉన్నా ఒక పార్టీకి ప్రెసిడెంట్ అంటే ఆ పార్టీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు నూరు అయినా సొంత పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది.

కానీ బీజేపీ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి కాషాయ జెండా ఏపీలో ఎలా ఎగురవేయాలి అన్న దాని మీద కంటే పీకల్లోతు కష్టాలలో ఉన్న టీడీపీ మీదనే సానుభూతిని చూపిస్తూ ఆ పార్టీ కోసమే తాను పనిచేయడం అన్నదే ఇపుడు సొంత పార్టీ వారికే అసలు ఏ మాత్రం నచ్చడంలేదు అంటున్నారు.

అలా బీజేపీ ముసుగులో టీడీపీకి ప్రోక్సీగా మారి పురంధేశ్వరి అన్ని పనులూ చక్కబెడుతున్నారని అంటున్నారు. బీజేపీ కోసం పురంధేశ్వరి ఏ మాత్రం పనిచేయడంలేదని అంటున్న గొంతులు కాషాయం పార్టీలో ఎక్కువ అవుతున్నాయి. అది చివరికి కమలం పార్టీలో లుకులుకలకు దారి తీస్తోంది అని అంటున్నారు.

పురంధేశ్వరి మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకురాలు కాదు, ఆమె కాంగ్రెస్ లో పదేళ్ల పాటు అధికారాన్ని కేంద్ర మంత్రి పదవిని అనుభవించి వచ్చారు. ఏపీలో కాంగ్రెస్ కి పుట్టగతులు లేవని తెలిసాక ఆ పార్టీని వదిలేసి మరీ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టే ఆమె చేరారు అని గుర్తు చేసే వారూ ఉన్నారు.

ఇక ఆమె రాజ్యసభ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారని అలా మరోసారి కేంద్ర మంత్రి కావచ్చు అని భావించారని కూడా ప్రచారం సాగింది. మొత్తానికి ఆమెకు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కింది. ఆమెకు ఈ పదవి ఇచ్చినది ఏపీలో బలమైన ఒక సామాజికవర్గాన్ని బీజేపీ వైపు తిప్పాలని, అలాగే టీడీపీలో అసంతృప్తులను కూడా కాషాయం వైపు నడిపించాలని. కానీ పురంధేశ్వరి మాత్రం బీజేపీ పదవిని టీడీపీ కోసం వాడుతున్నారు అని బీజేపీలో అంటున్న పరిస్థితి. మొత్తానికి పురంధేశ్వరి వల్ల ఈ కొద్ది నెలలలో మేలు ఏమైనా సొంత పార్టీకి జరిగిందా అంటే లేదు అనే జవాబు వస్తోంది అని అంటున్నారు. ఆమెతో పాటు ప్రో టీడీపీ బ్యాచ్ బీజేపీలో ఉన్నారు.

వారంతా టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు గెలవాలి అని అనుకుంటున్నారు. అలా తాను ఎంపీ అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావాలని పురంధేశ్వరి ప్లాన్ అని అంటున్నారు. అందుకోసమే ఆమె టీడీపీని బీజేపీలో ఉంటూ కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.