Begin typing your search above and press return to search.

పొత్తుతో పురంధేశ్వరి విశాఖకు షిఫ్ట్...!

టీడీపీ బీజేపీల మధ్యన పొత్తు కుదిరితే విశాఖ ఎంపీ సీటులో ఎవరు పోటీ చేస్తారు అన్నది ఒక ఆసక్తికరమైన చర్చగా ఉంది

By:  Tupaki Desk   |   10 Feb 2024 3:34 AM GMT
పొత్తుతో పురంధేశ్వరి విశాఖకు షిఫ్ట్...!
X

టీడీపీ బీజేపీల మధ్యన పొత్తు కుదిరితే విశాఖ ఎంపీ సీటులో ఎవరు పోటీ చేస్తారు అన్నది ఒక ఆసక్తికరమైన చర్చగా ఉంది. టీడీపీ నుంచి సినీ నటుడు బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఈసారి ఎంపీకే అని డిసైడ్ అయిపోయారు. ఆయనకు అదే చాన్స్ కూడా. వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీకి ఆయన ఇష్టపడడంలేదు. అలా చేద్దామన్నా సీటు కూడా కనిపించడంలేదు. సామాజిక సమీకరణల వల్ల కూడా అది వీలు కాదు.

వెలగపూడి రామక్రిష్ణబాబు విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తూంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన శ్రీభరత్ కి ఆ పక్కనే ఎమ్మెల్యే సీటు ఇవ్వడం కుదిరేది కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక చూస్తే 2019లో ఎంతో ఆశతో ఎంపీగా బరిలోకి దిగిన భరత్ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.

ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి ఆయనకు బీజేపీ పొత్తు పెను ఆటంకంగా మారుతోంది అని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే కనుక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. బీజేపీ పొత్తు సీట్లలో విశాఖ తో పాటు మరిన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి. పైగా బీజేపీ తాము గతంలో గెలిచిన సీట్లను ఎట్టి పరిస్థితులలో వదులుకోదు అని అంటున్నారు.

టీడీపీ బీజేపీ పొత్తులో 2014లో విశాఖ నుంచి బీజేపీ తరఫున హరిబాబు గెలిచారు. దాంతో పాటు చూస్తే పురంధేశ్వరి 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అయ్యారు. ఇలా ఈ రెండూ కలవడంతో ఆమె విశాఖనే కోరుకుంటున్నారు. ఇవ్వక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది.

మరి ఆమెకు విశాఖ ఎంపీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా సుముఖంగా ఉంటారు అని అంటున్నారు. పురంధేశ్వరి కూడా టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట. టీడీపీ పొత్తు ఉంటే విశాఖ నుంచి మరోసారి ఎంపీ అయి కేంద్రంలో ఏర్పడే బీజేపీ ప్రభుత్వంలో మంత్రి కావాలని ఆమె చూస్తున్నారు.

ఇలా విశాఖ ఎంపీ సీటు విషయంలో ఆమె గురి పెట్టారు అని తాజాగా వస్తున్న వార్తల సమాచారం. ఇక విశాఖ ఎంపీ సీటునే నమ్ముకుని చాలాకాలంగా పనిచేస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంగతి ఏంటి అంటే ఆయనకు వేరే సీటుకు పంపిస్తారు అని అంటున్నారు. ఇంతకాలం విశాఖను నమ్ముకుని రాజకీయం చేసి చివరలో వేరే చోటకు వెళ్తే గెలుస్తామా అన్న చర్చ కూడా జీవీఎల్ వర్గీయులలో ఉంది.

రాజమండ్రి ఎంపీ సీటు జీవీఎల్ కి ఇచ్చే అవకాశం ఉందని కూడా మరో మాట వినిపిస్తోంది. అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో పాటు రెండు సార్లు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు గెలిచారు. దాంతో విశాఖకు నియరెస్ట్ సీటు కాబట్టి జీవీఎల్ని అక్కడికి షిఫ్ట్ చేయవచ్చు అన్నది ఒక మాట. ఏది ఏమైనా పురంధేశ్వరి విశాఖకు షిఫ్ట్ అవుతారన్న వార్తలతో అటు జీవీఎల్ వర్గం ఇటు భరత్ వర్గంలోనూ కొంత కలవరం రేగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.