'విశాఖ'పై చిన్నమ్మ చూపు.. టీడీపీకి సంకటమే సుమా!
అంతేకాదు.. విశాఖ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది
By: Tupaki Desk | 3 March 2024 8:11 AM GMTబీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా ఉన్న టీడీపీకి పెద్ద సంకటమే వచ్చి పడింది. టీడీపీ యువ నాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కు కేటాయించాలని భావించిన విశాఖపట్నం ఎంపీ సీటును బీజేపీ కోరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత 2014లోనూ ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అప్పట్లో బీజేపీ నాయకుడు, ప్రస్తుత మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దక్కించుకుని విజయం సాధించారు. ఇక, ఇప్పుడు మరోసారి బీజేపీ అదే సీటును కోరుతోంది.
అంతేకాదు.. విశాఖ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. తాజాగా ఏపీలోని 25 పార్లమెంటుస్థానాల్లో 10 స్థానాల నుంచి బీజేపీ తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన జాబితా కూడా.. కేంద్ర పెద్దలకు పంపించినట్టు సమాచారం. దీనిలో విశాఖ నుంచి పురందేశ్వరి గట్టి పట్టుదలతో ఉన్నారు.కానీ, ఈ టికెట్‌ను టీడీపీ గత ఎన్నికల్లో బాలయ్య చిన్నల్లుడు భరత్‌కు కేటాయించింది.
అయితే, ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ దఫా అయినా.. విజయం దక్కించుకు నేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారు. ఆరు మాసాల కిందట చంద్రబాబు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు పొత్తు లో భాగంగా ఆ సీటును వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరి ఇదే జరిగితే భరత్ భవితవ్యం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.
దీనిలో అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే జనసేనకు ఇచ్చేసిన దరిమిలా.. విశాఖను బీజేపీకి కేటాయిస్తే.. ఇక, టీడీపీకి ఇక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో భరత్ను రాజమండ్రి నుంచి పోటీకి దింపుతారా? అనే చర్చ సాగుతోంది.ఇక్కడ వైసీపీ బలంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ.. స్థానికంగా టీడీపీ, జనసేన కార్యకర్తల బలం నేపథ్యంలో భరత్‌కు ఇక్కడ విజయావకాశాలను తోసిపుచ్చలేం. ఈ నేపథ్యంలో భరత్ విషయాన్ని పరిశీలిస్తే.. రాజమండ్రి పార్లమెంటు స్థానం మినహా మరో మార్గం కనిపించకపోవడం గమనార్హం.