Begin typing your search above and press return to search.

పురందేశ్వరి.. కాంగ్రెస్‌ లో మంత్రిగా ఉన్నప్పుడు అడగాల్సింది!

ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌ సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 July 2024 9:42 AM GMT
పురందేశ్వరి.. కాంగ్రెస్‌ లో మంత్రిగా ఉన్నప్పుడు అడగాల్సింది!
X

ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌ సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. హిందువులమని చెప్పుకునేవారు నిత్యం హింసను, విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారని, రెచ్చగొడుతున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ హిందువులందరినీ తప్పుపడుతున్నారని మండిపడ్డారు. అయితే తాను అన్నది కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగులో ఉండి హింసకు పాల్పడుతున్నవారినే తాను అన్నానని రాహుల్‌ వివరణ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. 1975లో ఎమర్జెన్సీని విధించినవారు, వేలాది మంది సిక్కులను ఊచకోత కోసినవారు పార్లమెంటులో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హిందువులందరూ అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారంటూ రాహుల్‌ వారి మనోభావాలను దెబ్బతీశారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు.

కాగా దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాహుల్‌ గాంధీకి ఈ విషయం చెప్పాల్సిందంటూ సెటైర్లు పడుతున్నాయి.

పురందేశ్వరి కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004 కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె గుంటూరు జిల్లా బాపట్ల నుంచి లోక్‌ సభకు ఎంపికయ్యారు. తిరిగి 2009లో విశాఖపట్నం ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫునే గెలుపొందారు.

అంతేకాకుండా 2004–2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో దగ్గుబాటి పురందేశ్వరి పదేళ్లపాటు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో తొలిసారే ఎంపీగా ఎన్నికయినప్పటికీ.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఎంతో మంది సీనియర్‌ ఎంపీలు ఉన్నప్పటికీ పురందేశ్వరికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్‌ చేశారు.

2004లో తొలిసారే గెలిచిన పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమయినా సోనియాగాంధీ వెనుకడగు వేయలేదు. దీంతో 2004 నుంచి 2014 వరకు దాదాపు పదేళ్లపాటు కాంగ్రెస్‌ ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్‌ గాంధీని క్షమాపణలు చెప్పాలంటున్న పురందేశ్వరి కాంగ్రెస్‌ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే అడగాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో ఉండి రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని కోరడం హాస్యాస్పదమంటున్నారు.