Begin typing your search above and press return to search.

ఉన్నవి సరిపోవా? ఏపీకి మళ్లీ కొత్త ఎయిర్ పోర్టు అవసరమా?

రాశి కన్నా వాసి ముఖ్యమన్న సామెతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్ని చూసినప్పుడు

By:  Tupaki Desk   |   17 July 2024 5:44 AM GMT
ఉన్నవి సరిపోవా? ఏపీకి మళ్లీ కొత్త ఎయిర్ పోర్టు అవసరమా?
X

రాశి కన్నా వాసి ముఖ్యమన్న సామెతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్ని చూసినప్పుడు. ఎయిర్ పోర్టుల విషయానికి వచ్చినంతనే ఏపీలో బోలెడన్ని ఎయిర్ పోర్టులు ఉన్నట్లు కనిపిస్తాయి. అవన్నీ కలిపినా కూడా తెలంగాణలో ఉన్న ఏకైక శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సరిరాదు. బేగంపేటలో ఎయిర్ పోర్టు ఉన్నప్పటికీ.. అది కేవలం కొన్ని ప్రత్యేక చాపర్లకు మాత్రమే వినియోగించటం తెలిసిందే.

ఏపీ విషయానికి వస్తే ఉన్నంతలో కాస్త రద్దీగా ఉండే విమానాశ్రయాలు విశాఖపట్నం.. గన్నవరం..రాజముండ్రి . ఈ మూడింటి ని కలిపినా కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టు రద్దీతో 15 శాతం కూడా ఉండదు. ఇక.. కడప.. కర్నూలు.. తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు ఉన్నప్పటికీ వాటికి ఉండే కనెక్టివిటీ చాలా పరిమితమన్న విషయం తెలిసిందే. అదే పనిగా ఎయిర్ పోర్టులు పెంచుకుంటూ పోయే కన్నా.. ఉన్న ఎయిర్ పోర్టుల్ని విస్తరించటం.. వాటికి కనెక్టివిటీ పెంచే అంశం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.

కానీ.. అలాంటిదేమీ లేకుండా ఏపీలో మరిన్ని ఎయిర్ పోర్టులు తెచ్చే అంశం మీద ఆసక్తి చూపిస్తున్న వైనం చూసినప్పుడు నోట మాట రాలేదు. ఉన్నవి చక్కబెట్టుకోకుండా కొత్తవాటి కోసం ఈ ఆరాటం ఎందుకున్న భావన కలుగుతుంది. చిన్నమ్మ అలియాస్ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్ పోర్టులు రానున్నట్లుగా చెబుతున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం.. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి.. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయగలుగుతామని చెప్పిన ఆమె.. డెవలప్ మెంట్.. కనెక్టివిటీ పెంపు కల్పిస్తామని చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిపోయింది. ఈ రోజుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ఉన్న కనెక్టివిటీ ఎంతన్నది పెద్ద ప్రశ్న. చిన్నఎయిర్ పోర్టులను తీసుకొచ్చినప్పటికీ.. అక్కడకు వచ్చే విమానాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల కలిగేప్రయోజనం ఏమిటన్నది అసలు ప్రశ్న.

మరోవైపు భోగాపురంలో ఏర్పాటు చేస్తున్న భారీ ఎయిర్ పోర్టు ఏళ్లకు ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. కూటమి సర్కారు వచ్చిన నేపథ్యంలో అక్కడ పనుల్లో వేగం పెరిగినట్లు చెబుతున్నా.. వాటిని పూర్తిచేసి.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది లేదు. ఇలాంటివేళ.. కొత్తగా మరో మూడు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లుగా పురంధేశ్వరి చేసిన ప్రకటన చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఉన్న వాటిని సక్క చేయకుండా.. కొత్త వాటి కోసం ఆరాటం అవసరమా? అన్న ప్రశ్న మదిలో మెదులుతుంది. కాదంటారా?