Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న ఆ వార్తపై పురందేశ్వరి సీరియస్... ఫేక్ అంటూ ఫైర్!

అయితే... ఇందుకు పూర్తి భిన్నంగా వైరల్ అవుతున్న ఆ వార్తను నమ్మొద్దని ముస్లిం సమాజానికి ఈ సందర్భంగా పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.

By:  Tupaki Desk   |   10 April 2024 6:57 AM GMT
వైరల్  అవుతున్న ఆ వార్తపై పురందేశ్వరి సీరియస్... ఫేక్  అంటూ ఫైర్!
X

కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు, నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఈ మాటలు వినిపించాయి. బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ముస్లింలకు 4శాతం ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారనే చర్చ బలంగా వినిపించింది!!

ఈ సమయంలో... "బీజేపీ - టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.. వైఎస్సార్‌ ప్రభుత్వం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు అన్యాయంగా కట్టబెట్టిందని ఆమె ఆరోపించారు.. కాగా గత తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే" అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో.. ఒక్కసారిగా ఈ వార్త తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రకటించినట్లుగానే ఇక్కడ పురందేశ్వరి ప్రకటించారా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని అంటున్నారు పురందేశ్వరి. ఇందులో భాగంగా... ముస్లిం రిజర్వేషన్‌ లపై తాను మాట్లాడినట్లుగా ఒక ఫేక్ వార్తను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఇదే సమయంలో.. "సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌" బీజేపీ నినాదం అని.. అంటే సమాజంలోని అందరినీ కలుపుకొని, అందరినీ అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతం అని చెప్పుకొచ్చారు. అయితే... ఇందుకు పూర్తి భిన్నంగా వైరల్ అవుతున్న ఆ వార్తను నమ్మొద్దని ముస్లిం సమాజానికి ఈ సందర్భంగా పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా... రాజమండ్రి లోక్‌ సభ ఎన్నికల్లో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి, ఓర్వలేక వైసీపీ పెయిడ్‌ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... నకిలీ వార్తలపై సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది!