బుల్లెట్ నడిపాడని చేతులు నరికేశారు.. తమిళనాడులో ఘోరం
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. తాలిబాన్ తరహా చర్యలకు పాల్పడిన ఈ ఆరాచకానికి తమిళనాడు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
By: Tupaki Desk | 14 Feb 2025 4:24 AM GMTవిన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. తాలిబాన్ తరహా చర్యలకు పాల్పడిన ఈ ఆరాచకానికి తమిళనాడు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒక దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్ బండిని నడపటం ఘోరమైన నేరంగా భావించటమే కాదు.. రెండు చేతుల్ని నరికేసిన అరాచక ఘటన తాజాగా చోటు చేసుకుంది. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఈ దారుణ ఉదంతం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టటం.. ముగ్గుర్ని అరెస్టు చేయటం లాంటి జరిగినా.. అసలు ఇంతటి దారుణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
శివగంగ జిల్లా మేల్ పిడవూరు గ్రామానికి చెందిన అయ్యాసామి.. శివగంగలోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల ఇతగాడు తనకు ఎంతో ఇష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు. ప్రతి రోజు తనకెంతో ఇష్టమైన బుల్లెట్ బండిని నడుపుకుంటూ కాలేజీకి పోతున్నారు. ఇతగాడి తీరును భరించలేకపోయారు ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు ఆగ్రహంగా ఉన్నారు.
జాతి తక్కువవాడివి బుల్లెట్ బండి నడుపుతావా? అంటూ రాయలేని భాషను వాడారు. అంతేకాదు.. తమ ముందే బండి ఎక్కటం.. బుల్లెట్ బండి కావాల్సి వచ్చిందా? అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాదు.. అతగాడి మీద దాడి చేశారు. ఈక్రమంలో కత్తులతో యువకుడి రెండు చేతులని నరికేశారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. రెండు చేతులుతెగిన వేళలో.. చుట్టుపక్కల వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే అతడి రెండు చేతుల్ని అతికించేందుకు వైద్యులు సర్జరీ చేస్తున్నారు.
బాధితుడ్ని ఆసుపత్రికి తరలించిన వేళలోనూ.. అతడి మీద దాడి చేసిన వారు అక్కడితో ఆగలేద సరికదా.. అతడి ఇంట్లోకి వెళ్లి సామాన్లను ధ్వంసం చేయటం గమనార్హం. తమ కంటే తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఖరీదైన బుల్లెట్ వాహనాన్ని కొని నడపటాన్నిసైతం జీర్ణించుకోలేని సమాజం మన చుట్టూ ఉందన్న విషయం అర్థమైనప్పుడు.. వెన్నులో చిన్నపాటి వణుకు రాక మానదు.