Begin typing your search above and press return to search.

డెడ్ బాడీకి ట్రీట్మెంట్.. మినిస్టర్ సీరియస్!

హైదరాబాద్ లో ఠాగూర్ ఎపిసోడ్ పై వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 11:13 AM GMT
డెడ్ బాడీకి ట్రీట్మెంట్.. మినిస్టర్ సీరియస్!
X

హైదరాబాద్ లో ఠాగూర్ ఎపిసోడ్ పై వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. మదీనగూడలోని సిద్ధార్థ న్యూరో ఆస్పత్రిలో తక్షణం తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని అధికారులు ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్నారు.

ఠాగూర్ సినిమా తరహాలో సిద్ధార్థ ఆస్పత్రిలో డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారని రెండు రోజుల క్రితం బాధితులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. బాధితుల ఆత్రుతను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఆస్పత్రి యాజమాన్యం మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించిందని విమర్శలు ఎదుర్కొంటోంది. చనిపోయిన మహిళ బతికి ఉన్నట్లు నమ్మించి మూడు రోజుల పాటు వైద్యం చేసి లక్షల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

కడప జిల్లాకు చెందిన 26 ఏళ్ల సుహాసిని నరాల సంబంధిత వ్యాధితో మదీనగూడలోని సిద్ధార్థ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం చేరింది. కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను ఆ అస్పత్రిలో చేర్చగా, నెల రోజుల నుంచి చికిత్స చేస్తున్నట్లు, ఆమె కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారని బాధితులు తెలిపారు. అయితే తమ వద్ద డబ్బు లేదని, చేతిలో డబ్బంతా వైద్యం కోసం ఖర్చు చేసినట్లు చెప్పడంతో గత శనివారం డిశ్చార్జి చేశారు. నిమ్స్ తరలించమని సిఫార్సు చేశారు. సిద్ధార్థ సూచనల మేరకు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా, ఆమె అప్పటికే మరణించిందని అక్కడి వైద్యులు బాధితులకు తెలిపారు. అంతేకాకుండా సుహాసిని మరణించి రెండు మూడు రోజులు అయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తమకు ఠాగూర్ తరహాలో మోసం చేశారని తెలుసుకున్న బాధితులు.. సిద్ధార్థ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం కల్పించుకుని ఆస్పత్రిలో తనిఖీలకు ఆదేశించింది.