టికెట్ వార్.. దామోదర వర్సెస్ జగ్గారెడ్డి
అంతే కాకుండా ఇప్పుడిది కాంగ్రెస్ లోని ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య తగువుకు కారణమైందనే చెప్పాలి. తాజాగా దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
By: Tupaki Desk | 8 Nov 2023 9:30 AM GMTతెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ కు టికెట్ల పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారింది. అభ్యర్థుల జాబితా ప్రకటించిన ప్రతిసారి అసమ్మతి చెలరేగడం, టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు గాంధీభవన్లో ధర్నాలు, నిరసనలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల మూడో జాబితా మరోసారి కాక రేపింది. అంతే కాకుండా ఇప్పుడిది కాంగ్రెస్ లోని ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య తగువుకు కారణమైందనే చెప్పాలి. తాజాగా దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
మూడో జాబితాలో పటాన్ చెరు టికెట్ను నీలం మధుకు, నారాయణ ఖేడ్ టికెట్ను సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ కేటాయించింది. కానీ ఈ ఇద్దరికి ఈ సీట్లు ఇవ్వడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. తన సొంత జిల్లాలో తాను సూచించిన నాయకులకు కాకుండా వేరేవాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సారి ఈ నియోజకవర్గాల నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, సంజీవరెడ్డిలకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ను దామోదర రాజనర్సింహ కోరారు. కానీ నీలం మధు, సురేశ్ షెట్కార్లకు టికెట్లు దక్కాయి. అయితే వీరి వెనుక జగ్గారెడ్డి ఉన్నారని రాజనర్సింహ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పేర్లు లేకపోయినా బీ ఫాంలు వచ్చేలా చూస్తానని రాజనర్సింహ చెప్పారని తెలిసింది.
ఈ వివాదం నేపథ్యంలో దామోదర రాజనర్సింహతో ఫోన్లో మాట్లాడిన మాణిక్ రావ్ ఠాక్రే అభ్యర్థుల పేర్లను తిరిగి పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు దామోదర రాజనర్సిపై జగ్గారెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే రాజకీయంగా తేల్చుకుందామని రాజనర్సింహాకు జగ్గారెడ్డి సవాలు విసిరారు. నీలం మధు టికెట్ విషయంలో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మంచి పద్ధతి కాదని జగ్గారెడ్డి హెచ్చరించారు.