Begin typing your search above and press return to search.

ముందు ఐమాక్స్, జలవిహార్‌లను కూల్చండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 6:28 AM GMT
ముందు ఐమాక్స్, జలవిహార్‌లను కూల్చండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు గత ప్రభుత్వం లోపాలను వెలుగులోకి తెస్తూనే.. తమ ప్రభుత్వంలో అలాంటి పొరపాట్లు జరగొద్దని జాగ్రత్త పడుతున్నారు. అయితే.. ఏటా వరదల కారణంగా ప్రజలు భారీగా నష్టపోతున్నారు. అక్రమ కట్టడాలు.. ఇష్టారాజ్యంగా నిర్మించిన నిర్మాణాల వల్లే ఇలా జరుగుతోందని రేవంత్ రెడ్డి అభిప్రాయానికి వచ్చారు. దాంతో అక్రమ కట్టాల భరతం పట్టాలని భావించారు.

రేవంత్‌రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే హైడ్రా. రెండు నెలల క్రితం ఏర్పాటైన హైడ్రా.. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కవచంలా నిలుస్తోంది. పేద, పెద్ద తేడా లేకుండా అక్రమ కట్టడాలను కూలుస్తుండడంతో చాలా వరకు హైడ్రాకు సపోర్టు లభించింది. అయితే.. కొన్ని సందర్భాల్లో ప్రజల నుంచి నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన నేపథ్యంలో అక్కడి పరిధిలోని ఖాళీ చేయించే క్రమంలో వారి నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కట్‌చేస్తే.. హైడ్రాను చాలా మంది స్వాగతిస్తుంటే.. పొలిటికల్‌గా మాత్రం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. హైడ్రాపై తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి స్పందించారు. మళ్లీ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితుల ఇళ్లను కూల్చివేస్తుండడంపై ఆయన మాట్లాడుకొచ్చారు.

పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదని, మురికివాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించాను అని దానం చెప్పారు. కూలగొట్టడానికి ఐమాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నాయని, వాటి మీద దృష్టి పెట్టండి ముందు అని సూచించారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇల్లు కూలగొట్టాల్సింది అని పేర్కొన్నారు. వారికి ఎలాంటి ఉపాధి చూపకుండానే ముందుగానే ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఈ అంశాన్ని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.