Begin typing your search above and press return to search.

ఇదీ విధి.. 20 ఏళ్ల కిందట ఎంపీ టికెట్.. ఇప్పుడు పోటీ

ఓ నాయకుడు.. కాంగ్రెస్ లో చురుగ్గా తిరిగేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీపై తీవ్రంగా పోరాడాడు.

By:  Tupaki Desk   |   17 March 2024 3:30 PM GMT
ఇదీ విధి.. 20 ఏళ్ల కిందట ఎంపీ టికెట్.. ఇప్పుడు పోటీ
X

ఓ నాయకుడు.. కాంగ్రెస్ లో చురుగ్గా తిరిగేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీపై తీవ్రంగా పోరాడాడు. ఈసారి ఆయన గెలిస్తే, పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవి దక్కుతుందని భావించారు. అయితే, కీలక ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయంలో వారి పార్టీ పొత్తులో భాగంగా ఆయన సీటును మిత్రపక్షానికి కేటాయించింది. ఆ నాయకుడికి ఎంపీగా పోటీ చేయమని ఆఫర్ ఇచ్చింది. కచ్చితంగా గెలుస్తావని, కేంద్రంలో మంత్రి పదవీ వస్తుందని చెప్పింది. కానీ, ఆవేశంలో ఆ నాయకుడు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పాడు. అప్పటిదాక పోరాడిన అధికార పార్టీలోనే చేరి అసెంబ్లీ టికెట్ తెచ్చుకుని గెలిచాడు. కానీ, ఆ పార్టీ ఓడిపోయింది. ఆయన మొన్నటివరకు ఉన్న పార్టీ గెలిచింది. ఈ తర్వాత కథ అనేక మలుపులు తిరిగింది.

అటు ఇటు..

పైన చెప్పుకొన్నదంతా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గురించి. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన నాగేందర్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుచరుడు. 1999-2004 మధ్యలో కాంగ్రెస్ లో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా చురుకైన పాత్ర పోషించారు. చంద్రబాబు సారథ్యంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పోరాడు. 2004లో కాంగ్రెస్ కు అంతా సానుకూల వాతావరణం ఉండగా నాగేందర్ ఆసిఫ్ నగర్ సీటును వేరే పార్టీకి ఇచ్చింది కాంగ్రెస్. దానంకు సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇస్తామని, కచ్చితంగా గెలిచే వాతావరణం ఉందని, కేంద్రంలో మంత్రిని చేస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ దానం టీడీపీలో చేరారు. ఆసిఫ్ నగర్ నుంచి గెలిచారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ నెగ్గడం, తనకు ఇష్టమైన నాయకుడు వైఎస్ సీఎం కావడతో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఓడిపోయారు. ఈ నియోజకవర్గం రద్దవడంతో 2009లో ఖైరతాబాద్ కు మారారు. అక్కడినుంచి గెలిచి వైఎస్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. కాగా.. 2014లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. 2018లో బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లోనూ నెగ్గారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్ గూటికి వచ్చారు.

అప్పుడు వద్దన్న ఎంపీ టికెట్..

సరిగ్గా 20 ఏళ్ల కిందట కోరి మరీ ఇచ్చిన ఎంపీ టికెట్ ను వద్దన్నారు దానం నాగేందర్. కచ్చితంగా అసెంబ్లీకే పోటీ చేస్తానని పట్టుబట్టారు. అటు చూస్తే నాడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన అంజన్ కుమార్ యాదవ్ సునాయాసంగా నెగ్గారు. 2009లోనూ గెలిచారు. ఇప్పుడు ఆయన కుమారుడికి రాజ్య సభ సభ్యత్వం కూడా ఇచ్చారు. ఒకవేళ 2004లోనే తాను ఎంపీగా పోటీ చేసి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడినని ఆ తర్వాత దానం పలు సందర్భాల్లో చెప్పారు. అప్పుడు తన రాజకీయ జీవితం మరో స్థాయిలో ఉండేదని కూడా అన్నారు. అయితే, విధి అంటే ఇదేనేమో.. 2004లో వద్దన్న ఎంపీ టికెట్ మళ్లీ ఇప్పుడు ఆయనను వరించింది. నాడు కాంగ్రెస్ ఉండి కూడా టికెట్ తీసుకోని ఆయన.. నేడు కాంగ్రెస్ లో చేరి మరీ టికెట్ పొందాల్సి వచ్చింది.

కొసమెరుపు: దానం సికింద్రాబాద్ స్థానం నుంచి గెలిస్తే ఎంపీగా ఉంటారు. ఓడితే మాత్రం తెలంగాణ మంత్రివర్గంలో చోటు కల్పించే ఒప్పందంపై కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది.