దడ పుట్టిస్తున్న డ్రోన్లు.. మావోయిస్టుల ఏరివేతలో బలగాలకు తోడ్పాటు
దండకారణ్యంలో సైలెంట్ కిల్లర్స్ గా పనిచేస్తున్న మానవ రహిత డ్రోన్లు (యూఏవీ)లు 50 ఏళ్ల ఉద్యమానికి ముగింపు పలకడంలో కీలకంగా పనిచేస్తున్నాయి.
By: Tupaki Desk | 23 Jan 2025 12:30 PM GMTదండకారుణ్యం మావోయిస్టులకు పెట్టని కోట. దుర్బేద్యమైన ఆ కోటలో అడుగు పెట్టాలంటే ఒకప్పుడు పోలీసులకు హడల్. ఎటువైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందనే టెన్షన్ తో భద్రతాబలగాలు అటువైపు వెళ్లేందుకు సాహసించేవి కావు. ఇన్ఫార్మర్లు సమాచారంతోనే ముందుకు కదులుతూ ఆపరేషన్లు నిర్వహించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందే దండకారుణ్యమే కాదు మావోయిస్టులకు గట్టి పట్టున్న కాంకేర్ అడవుల్లోనూ మృత్యుకేళీతో మావోయిస్టులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఒకప్పుడు జనతన సర్కార్ నడిపిన తమ నేలలో ఇలాంటి పరిస్థితి వస్తుందని మావోయిస్టులు ఊహించి ఉండరు. దానికి కారణం వారు టెక్నాలజీని సరిగా అంచనా వేయలేకపోవడమే. టెక్నాలజీని సమర్థంగా వాడుకుంటున్న పోలీసు యంత్రాంగం మావోయిస్టులపై పట్టు బిగిస్తోంది. మావోయిస్టుల పాలిట మృత్యు పాశం.. పోలీసులకు విజయ దరహాసం అందిస్తున్న ఆ టెక్నాలజీ పేరే డ్రోన్. దండకారణ్యంలో సైలెంట్ కిల్లర్స్ గా పనిచేస్తున్న మానవ రహిత డ్రోన్లు (యూఏవీ)లు 50 ఏళ్ల ఉద్యమానికి ముగింపు పలకడంలో కీలకంగా పనిచేస్తున్నాయి.
పగలు, రాత్రి తేడా లేదు. వాతావరణ అనుకూల, ప్రతికూలతలతో పనిలేదు. ఇచ్చిన టార్గెట్ను సైలెంటుగా పూర్తి చేయడమే యూవీఏల గొప్పతనం. దేశ సరిహద్దు భద్రత కోసం సైన్యం వాడిన యూవీఏలను మావోయిస్టుల ఏరివేతకు వాడాలని కేంద్రం నిర్ణయించిన నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అంతవరకు తమను టచ్ చేయలేరని మావోయిస్టులు గొప్పగా చెప్పుకున్న ప్రాంతమైన దండకారుణ్యంలోనే నిలువ నీడలేని పరిస్థితి ఎదురైంది. 2026 మార్చిలోగా నక్సలిజంను అంతమొందిస్తామని ప్రతినబూనిన కేంద్ర సర్కార్ భద్రతా బలగాలకు 28 యూవీఏలను సమకూర్చింది. వీటి రంగం ప్రవేశంతో యుద్ధరీతి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎన్ కౌంటర్ జరిగితే రెండు వైపులా నష్టం ఉండేది. కానీ యూవీఏలు యాక్షన్ లోకి దిగిన తర్వాత వార్ వన్ సైడ్ అయింది. వరుస ఎన్ కౌంటర్లలో పదుల సంఖ్యలో ఉద్యమకారులు నేలకొరుగుతున్నారు. ముఖ్యంగా పార్టీ టాప్ లీడర్లు కూడా ఈ ఎన్ కౌంటర్లతో ప్రాణాలు కోల్పోవడం మావోయిస్టు పార్టీ ఊహించలేకపోయింది.
మావోయిస్టుల ఏరివేతకు డ్రోన్స్ వాడాలని కేంద్రం నిర్ణయించడంతోనే నక్సలిజం పతనం మొదలైందని అంటున్నారు. భూమిపై ఉండగా సౌండ్ చేసి స్విచబుల్ డ్రోన్స్ గాలిలో ఎగిరాక ఎలాంటి శబ్దం చేయవు. సైలెంటుగా గగతనంలో ఎగురుతూ టార్గెట్స్ ను గుర్తించడంతోపాటు అక్కడికి చేరుకోడానికి సురక్షితమైన మార్గాన్ని సూచిస్తుండటంతో భద్రతాబలగాల పని సులవు అవుతోంది. అడవులు, కొండలు, గుట్టులు, నదీ ప్రాంతాలు ఇలా ఎంతో క్లిష్టమైన ప్రాంతంలో కూడా డ్రోన్స్ పనిచేస్తున్నాయి. ఏరియల్ సర్వెలైన్స్ ద్వారా కూబింగ్ ఆపరేషన్ తేలికైపోయింది. ఇన్ఫార్మర్ వ్యవస్థతో పనిలేకుండా పోయింది. ఆకాశంలో ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా డ్రోన్స్ పనిచేస్తున్నాయి. టార్గెట్స్ ను గుర్తిస్తున్నాయి. ఆకాశంలో ఎగురుతూ మావోయిస్టుల కదలికలను ఎప్పటకప్పుడు చేరవేస్తుండటం వల్ల వారి ఉనికి కనిపెట్టడంలో పోలీసులు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయింది.
2022 నుంచి దండకారుణ్యంలో డ్యూటీ చేస్తున్న డ్రోన్లు పోలీసు, భద్రతాబలగాలకు చెప్పుకోదగ్గ విజయాలను అందించాయి. ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత ఏకధాటిగా రెండున్నర గంటల పాటు గాలిలో ఎగురుతూ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడంతోపాటు లైవ్ లోకేషన్ షేర్ చేయడం స్విచబుల్ డ్రోన్స్ ప్రత్యేకత. గగనతలంలో ఎలాంటి శబ్దం చేయకుండా ఎరిగే డ్రోన్స్ ను మావోయిస్టులు గుర్తించడంలో విఫలమవుతున్నారు. అంతేకాకుండా ఆధునిక టెక్నాలజీ వాడి ఈ డ్రోన్స్ తయారు చేయడం వల్ల సత్ఫలితాలనిస్తోంది. స్టెల్త్ మోడ్ లో పనిచేసే డ్రోన్ లు సైలెంట్ గా తమ పనిచేయడంతోపాటు 25 ఎక్స్ సామర్థ్యంతో జూమ్ కెమెరాతో ఫొటోలు వీడియోలు తీస్తున్నాయి. ఆకాశం నుంచి నేలపై లేదా, నది, అడవి ఇలా ఎక్కడైనా వెయ్యి మీటర్ల దూరం నుంచే స్పష్టమైన చిత్రాలను చిత్రీకరించడం వీటి గొప్పతనం. రాత్రి వేళల్లో కూడా టార్గెటును గుర్తించేలా థర్మల్ కెమెరా పనిచేస్తుంది. దీని సహాయంతో మనుషులు అలికిడిని గుర్తించడంతోపాటు వారు మావోయిస్టులా? ఆదివాసీలా? వారి వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ఎంత మంది ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేది ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరిపోతోంది.
అధికారిక సమాచారం ప్రకారం దండకారుణ్యంతోపాటు కాంకేర్ అడవుల్లో మొత్తం 28 డ్రోన్స్ పనిచేస్తున్నాయి. ఇవి 15 కిలోమీటర్ల పరిధిలో ఏరియల్ సర్వెలైన్స్ నిర్వహిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటరుకు సమాచారం ఇస్తుంది. ఈ సమాచారాన్ని విశ్లేషించుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బలగాలకు గైడెన్స్ ఇస్తుండటం వల్ల మావోయిస్టుల కోటలో పోలీసులు పాగా వేయగలిగారని చెబుతున్నారు. డ్రోన్స్ రంగంలోకి దిగిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్ అన్నదే లేకుండా పోయింది. గత ఆరు నెలలుగా భద్రతా బలగాలు ఎక్కువగా డ్రోన్స్ వాడుతుండటంతో మావోయిస్టుల ఏరివేత వేగవంతమైంది. ఇటీవల జరిగిన ఆరు ప్రధాన ఎన్‌కౌంటర్లలో డ్రోన్స్ కీలకంగా మారాయి. గత మూడు ఎన్‌కౌంటర్లలో సగటును 12 మంది మరణించేందుకు కారణమయ్యాయి. మావోయిస్టుల ఏరివేతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్ సమాచారంతో అత్యంత భద్రత మధ్య ఉండే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులను బలగాలు ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎన్‌కౌంటర్ లో కూడా మావోయిస్టు నేత చలపతిని ఇదేవిధంగా మట్టుబెట్టాయి. చలపతికి మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కానీ, డ్రోన్ గైడెన్స్ తో ఒక్కో అంచెను ఛేదించుకుంటూ ముందుకెళ్లిన పోలీసులు చలపతిని మట్టుబెట్టినట్లు చెబుతున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే మావోయిస్టుల కోటగా చెప్పే అబూజ్ మడ్, కాంకేర్ అడవులను ఉద్యమకారులు ఖాళీ చేయక తప్పదని అంటున్నారు.