ప్రాంతీయ పార్టీలకు డేంజర్ బెల్స్...నెక్స్ట్ టార్గెట్ దీదీ !
నెమ్మదిగా ఒకే దేశం ఒకే ఎన్నిక తో పాటు ఒకే జాతీయ పార్టీ అన్న నినాదాన్ని కూడా అందుకుంటోందా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 8 Feb 2025 10:30 PM GMTదేశంలో వరుసగా ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గుతూ పోతోంది. ఆ ప్లేస్ లోకి బీజేపీ వస్తోంది. నెమ్మదిగా ఒకే దేశం ఒకే ఎన్నిక తో పాటు ఒకే జాతీయ పార్టీ అన్న నినాదాన్ని కూడా అందుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. బీజేపీ తలచుకుంది అంటే స్పాట్ పెట్టేసినట్లే. ఆయా పార్టీలకు మూడినట్లే అన్నది బాగా అర్ధమవుతున్న విషయం.
ఇటీవల కాలంలో బీజేపీ జోరు మామూలుగా లేదు. వరసగా హర్యానా, మహారాష్ట్రలో గెలిచి ఇపుడు ఢిల్లీల్తో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టింది. ఇక్కడ తమాషా ఏంటి అంటే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెక్ పెట్టింది. అలాగే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని సైతం డౌన్ చేసి పారేసింది. లేటెస్ట్ గా ఢిల్లీలో గెలుపుతో ఆప్ ని కూడా ఒక మూల పెట్టేసింది.
ఇక దీనికంటే గత ఏడాది ఏపీలో వైసీపీని గద్దె దించడంతో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించడంలో బీజేపీ రాజకీయ మంత్రాంగం బాగా పనిచేసింది. అంతే కాదు అదే ఏడాది ఒడిషాలోని బిజూ జనతాదళ్ అనే మరో ప్రాంతీయ పార్టీని అధికారం నుంచి తప్పించి అక్కడ కమల వికాసానికి నాంది పలికింది. తెలంగాణాలో 2023 చివరలో ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఇలా ప్రాంతీయ పార్టీలు వరసబెట్టి కుదేల్ అయిపోయాయి.
ఇక చూస్తే దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు చూస్తే బీజేపీకి గట్టి ప్రత్యర్థులుగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే స్టాలిన్ బలంగా ఉన్నారు. విశేషం ఏంటి అంటే ఈ రెండు రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికలు ఒక విధంగా రాజకీయ సవాల్ గానే ఉంటాయి.
పదిహేనేళ్ళ పాలనలో యాంటీ ఇంకెంబెన్సీ తప్పకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో బీజేపీది అందె వేసిన చేయి. ఇక వచ్చే ఏడాది మేలో బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. దాంతో బీజేపీ టీం మొత్తం అక్కడకి ఇప్పటి నుంచే షిఫ్ట్ అయి తమదైన యాక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. దీదీని 2021లో ఓడించాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ కుదరలేదు. అయితే బెంగాల్ లో బీజేపీ బలం 70 అసెంబ్లీ సీట్ల దాకా పెరిగింది. ఈసారి మాత్రం బీజేపీ అక్కడ ఊరుకునే ప్రశ్న లేదు అని అంటున్నారు.
దీదీని ఎలాగైన ఓడించాలన్న తన పంతం నెరవేర్చుకోవడానికి చూస్తుంది అని అంటున్నారు. అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ ని గద్దె దించే ప్రయత్నం అయితే చేస్తుంది అని అంటున్నారు. కానీ అక్కడ బీజేపీకి బలం తక్కువ. దాంతో పాటు కొత్త పార్టీలు పుట్టుకుని వస్తున్నాయి. ఏదో విధంగా అక్కడ తన పట్టుకుని పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ ఏడాది చివరిలో బీహార్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈసారి బీహార్ పీఠాన్ని గట్టిగా కొట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. అక్కడ జేడీయూతో కలసి పొత్తు ఉంది. అయితే ఈ పొత్తుని కంటిన్యూ చేస్తూనే బీహార్ లో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలన్నది కమలనాధుల అజెండాగా ఉంది అంటున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో జేడీయూ టీడీపీ మిత్రులు కాబట్టి వారికి ఇబ్బంది అయితే లేదు కానీ దేశంలో ఒక వైపు కాంగ్రెస్ ని మరో వైపు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ తనదైన రాజకీయ కార్యాచరణను రూపొందిస్తోంది అని అంటున్నారు. దాంతో ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రాంతీయ పార్టీలకు గడ్డు రోజులు వచ్చాయని అంటున్నారు.