ఆసుపత్రుల్లో వచ్చే బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్లు ఎంత డేంజరంటే?
ఇందులో బీఎస్ఐ.. మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు.. వెంటిలేటర్ తో ముడిపడిన నిమోనియా లాంటి వ్యాధుల తీరు తెన్నులపై ఫోకస్ చేశారు.
By: Tupaki Desk | 7 Oct 2024 2:30 PM GMTఆసుపత్రులకు వెళ్లే వేళ.. చిన్నపిల్లల్ని వెంట తీసుకెళ్లొద్దంటూ చెబుతుంటారు. కానీ.. కొందరు మాత్రం ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. ఆసుపత్రుల్లో బ్యాక్టీరియా ఎంత డేంజర్ అన్న విషయం తాజాగా విడుదలైన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం చెప్పేసింది. ఆసుపత్రుల్లో వచ్చే బ్యాక్టిరియా ఇన్ ఫెక్షన్లు మొండిగా తయారవుతున్న విషయాన్ని వెల్లడించింది. భారతదేశంలోని ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఈ బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ చికిత్సకు సైతం లొంగట్లేదన్న నిజం వెల్లడైంది. రక్తంలో ఇన్ ఫెక్షన్లకు ప్రధానంగా కారణమయ్యేది క్లెబ్సియెల్లా నిమోనియే అని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చేరిన 48 గంటల తర్వాత రోగులకు ఏదైనా ఇన్ ఫెక్షన్ తలెత్తితే దాన్ని సదరు ఆసుపత్రి కేంద్రంతో ముడిపడి ఉన్న ఇన్ ఫెక్షన్ గా పేర్కొంటారు. మనదేశంలోని 39 ఆసుపత్రులను పరిశీలించిన అనంతరం ఐసీఎంఆర్ ఒక రిపోర్టును తయారు చేసింది. ఇందులో బీఎస్ఐ.. మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు.. వెంటిలేటర్ తో ముడిపడిన నిమోనియా లాంటి వ్యాధుల తీరు తెన్నులపై ఫోకస్ చేశారు.
దీని ప్రకారం కొన్ని బ్యాక్టీరియాలు ఎంత ప్రమాదకరమైనవన్న విషయాన్ని గుర్తించారు. ఈకోలి బ్యాక్టీరియాతో వచ్చే రక్త సంబంధ ఇన్ ఫెక్షన్లకు చికిత్స చేయటానికి పిపెరాసిలిన్ - టాజో బయాక్టమ్ లాంటి యాంటీ బయాటిక్స్ ను వాడుతున్నారు. అయితే.. ఏడేళ్లుగా అవి ఆసుపత్రుల్లోని రోగులపై పని చేయటం లేదన్న విషయాన్ని గుర్తించారు. నిమోనియాకు యాసినెటోబ్యాక్టర్ ఎస్ పీపీ అనే బ్యాక్టీరియా కారణంగా తేల్చారు.
మూత్రాశయ ఇన్ ఫెక్షన్లకు కారణమయ్యే ఈకోలి.. క్లెబ్సియెల్లా నిమోనియే.. యాసినెటోబ్యాక్టర్ బౌమానైల్లో యాంటీ బయాటిక్ నిరోధకత ఎక్కువగా కనిపిస్తోందని తేల్చారు. ఇవి కార్బాపెనెమ్ ఫ్లోరోక్వినోలోన్స్.. థర్డ్ జనరేషన్ సెఫాలో స్పోరిన్ అనే యాంటీబయాటిక్స్ కు లొంగట్లేదన్న విషయాన్ని గుర్తించారు. సో.. ఆసుపత్రులకు ఎంతో అవసరం తప్పించి.. వెళ్లొద్దు. ఒక వేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మరవొద్దు.