Begin typing your search above and press return to search.

మొన్న 351.. నిన్న 471.. ప్రమాధకరంగా ఢిల్లీలో ఏక్యూఐ రిపోర్ట్స్!

మరోపక్క ఢిల్లీ కాలుష్యం కేవలం రాజధానికి మాత్రమే పరిమితమైంది కాదని, ఉత్తరభారతం కూడా అదే గాలి పీలుస్తోందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 4:03 AM GMT
మొన్న 351.. నిన్న 471..  ప్రమాధకరంగా  ఢిల్లీలో ఏక్యూఐ రిపోర్ట్స్!
X

ఢిల్లీ-ఎన్సీఆర్ గాలి నాణ్యత శుక్రవారం నాటికి మరింత దిగజారింది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) చాలా చోట్ల భయంకరమైన స్థాయికి చేరుకోవడంతో 500 స్కేల్‌ పై "400" డేంజర్ మార్క్‌ ను అధిగమించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. ఆనంద్ విహార్ స్టేషన్, పంజాబీ బాగ్ స్టేషన్, ముండ్కా స్టేషన్ ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలను "తీవ్ర" విభాగంలో 400 మార్కు కంటే ఎక్కువగా నమోదు చేసింది.

అవును... దేశ రాజధానిలో వాయు కాలుష్యం శుక్రవారం ఉదయానికి అతి తీవ్ర స్థాయికి చేరింది. గురువారం ఉదయం 10 గంటలకు 351గా చూపిన ఏక్యూఐ.. శుక్రవారం ఉదయం 9 గంటలకు 471కి చేరింది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగానే కాలుష్యం ఇలా ఉందని చెఉతున్నారు! ఇది ఇలానే కొనసాగితే అతితీవ్ర (ప్రమాధకర) స్థాయికి చేరుకోవడానికి ఎక్కువ సమయమేమీ పట్టదని అంటున్నారు.

మరోపక్క ఢిల్లీ కాలుష్యం కేవలం రాజధానికి మాత్రమే పరిమితమైంది కాదని, ఉత్తరభారతం కూడా అదే గాలి పీలుస్తోందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వాయుకాలుష్య నివారణలో కేంద్రం కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఈ సమయంలో... తాజా పరిస్థితితో ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో తప్పనిసరి కాని నిర్మాణాలను నిలివేయడంతో పాటు కార్ల రాకపోకలను నిషేధిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని సూచించింది.

ఇందులో భాగంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలకు శుక్రవారం, శనివారాల్లో సెలవు ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే సమయంలో... ఢిల్లీ ప్రభుత్వం అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించిందని.. ఢిల్లీ గురుగ్రాం, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ నగర్‌ లలో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లను నడపడంపై నిషేధం విధించింది.

ఇదే సమయంలో... ఢిల్లీ మెట్రో 20 అదనపు రైళ్లను నడుపుతుంది. ప్రజలు కార్లను తొలగించి మెట్రోను ఉపయోగించమని కోరుతోంది.

ఈ విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా... వాయు కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ ఏక్యూఐ దిగజారిన రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బిహార్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించింది. అక్టోబరు 20 నుంచి ఈ నెల 1వ తేదీ వరకూ నమోదైన ఏక్యూఐ పాయింట్లను పరిశీలించిన మీదట ఈ ఆదేశాలను ఇచ్చారని తెలుస్తుంది.

కాగా... ఏక్యూఐ సున్నా - 50 మధ్య ఉంటే ఆ వాతావరణం మంచిదిగా పరిగణించబడుతుంది. 51 - 100 సంతృప్తికరంగా, 101 - 200 మధ్యస్థంగా, 201 - 300 పేలవంగా, 301 - 400 చాలా పేలవంగా ఉన్నట్లు చెబుతారు. ఇక 401 - 500 మద్య ఉంటే తీవ్రంగా ఉందని.. 500 కంటే ఎక్కువ ఉంటే అది ప్రమాదకరం అని చెబుతారు! ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు 471కి చేరింది!