ఆఫ్రిది మతం మారమన్నాడు.. పాక్ హిందూ క్రికెటర్ సంచలన ఆరోపణ
కాగా, కనేరియా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
By: Tupaki Desk | 13 March 2025 12:15 PM ISTపాకిస్థాన్ క్రికెట్ లో మతం అనేది ప్రధానమైనది. ఆ దేశ దిగ్గజ బ్యాట్స్ మన్ మొహమ్మద్ యూసుఫ్. కానీ, ఇతడి అసలు పేరు యూసుఫ్ యొహానా. క్రిస్టియన్ అయిన యొహానా.. ఎంతగా రాణించినా పాకిస్థాన్ కెప్టెన్సీ దక్కలేదు. చివరకు అతడు మతం మారి మొహమ్మద్ యూసుఫ్ అయ్యాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత మత గురువుగా మారిపోయాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇద్దరే ఇద్దరు హిందువులు ప్రాతినిధ్యం వహించారు. మొదటి వ్యక్తి వికెట్ కీపర్ అనిల్ దళపతి కాగా రెండో ఆటగాడు స్పిన్నర్ డానిష్ కనేరియా. పాకిస్థాన్ స్పిన్నర్లలో మేటిగా ఎదిగే అవకాశం ఉందని భావించిన కనేరియా కెరీర్ అనుకున్నంత స్థాయిలో సాగలేదు. 61 టెస్టుల్లో 261 వికెట్లు తీసిన కనేరియా 29 ఏళ్ల వయసుకే జట్టుకు దూరమయ్యాడు. ఒకవేళ మరికొన్నాళ్లు పాకిస్థాన్ కు ఆడి ఉంటే 400 వికెట్లు పైనే తీసేవాడేమో?
కాగా, కనేరియా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థాన్ లో తాను వివక్ష ఎదుర్కొన్నానని, కెరీర్ నాశనం కావడానికి అదే ప్రధాన కారణమని ఆరోపించాడు. మరీ ముఖ్యంగా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గురించి తీవ్ర ఆరోపణలు చేశాడు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరిగన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. మాట్లాడుతూ.. మనమంతా వాషింగ్టన్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని.. పాక్ లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడం బాగుందని చెప్పుకొచ్చాడు. అక్కడ వివక్ష ఎదుర్కొన్నామని.. ఇప్పుడు గొంతు విప్పుతున్నామని తెలిపాడు.
పాక్ లో తనకు తగిన గౌరవం రాలేదని.. దీనికి కారణం మైనారిటీ హిందువులం కావడమేనని తెలిపాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్న తాను పాకిస్థాన్ లో అనుభవించిన కష్టాలు అమెరికాకు తెలిస్తేనే ఏదో ఒక చర్యలకు వీలవుతుందని పేర్కొన్నాడు.
అఫ్రిది కెప్టెన్ గా ఉన్నప్పుడు తనను మతం మారమని బాగా ఒత్తిడి చేశాడని కనేరియా తెలిపాడు. తనకు అండగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అని.. షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది సహా కొందరు ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కనేరియా ఆరోపించాడు. కనీసం తనతో కలిసి తినేవారు కూడా కాదని తెలిపాడు. మతం మారడం గురించి ఇంజమామ్ కనీసం ప్రస్తావన కూడా తెచ్చేవాడు కాదని కనేరియా కొనియాడాడు.
కాగా, కనేరియా కూడా కాస్త వివాదాస్పదుడే. గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.