68వ అంతస్తు నుంచి పడిన సాహసికుడు!
అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఎక్స్ పర్ట్ గా పేరున్న రెమీ లుసిడి
By: Tupaki Desk | 31 July 2023 8:24 AM GMTకొంతమందికి సాహసాలంటే పిచ్చి! సాహస యాత్రలు చేయడం.. పెద్ద పెద్ద పర్వతాలు అధిరోహించడం.. సముద్ర గర్భంలో సెల్ఫీలు తీసుకోవడం.. అత్యంత ఎత్తైన చోట ఫోటోలు దిగడం వంటివి చాలా మంది సాహసికులకు అత్యంత ఇష్టమైన విషయం. అయితే తాజాగా జరిగిన ఒక సాహసం... విషాదంగా ముగిసింది.
అవును... అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఎక్స్ పర్ట్ గా పేరున్న రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రమాదాలతో చెలగాటమాడటం సరదాగా భావించే 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడు... తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్ లో చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాన్స్ కు చెందిన 30 ఏళ్ల సాహసికుడు రెమీ లుసిడి తాజాగా ఒక "ఎత్తైన" నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా హాంకాంగ్ లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ ను అధిరోహించాలని ప్రయత్నించాడు. అనుకున్నట్లుగానే ఈ భవనం 68వ ఫ్లోర్ కి చేరుకున్నాడు.
అయితే అలా 68వ ఫ్లోకి చేరుకున్న రెమీ... ఆ ఫ్లోర్ లోని పెంట్ హౌస్ కిటికిబయట చిక్కుకుపోయాడు. దీంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. ఆ తర్వాత అతడి కాలు అక్కడి నుంచి పట్టుతప్పింది. దీంతో అంతెత్తునుంచి నేరుగా కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే అంతకుముందు సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చిన రెమీ లుసిడి... 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. అయితే... 40వ అంతస్తులో సదరు వ్యక్తి, రెమీ ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పటికే లుసిడి ఎలివేటర్‌లో పైకి వెళ్లడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో ఉదయం 7.38 సమయంలో అతడిని 68వ అంతస్తులోని పెంట్ హౌస్ లో చూసిన పనిమనిషి షాకై.. పోలీసులకు కాల్ చేసింది. ఆ సమయంలో కిటికీ బయట చిక్కుకున్న అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. సంఘటనా స్థాలనికి వచ్చిన పోలీసులు... అతడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు.