వివేకా కేసులో మరో ట్విస్ట్ ఇచ్చిన దస్తగిరి!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తూ సీరియల్ మాదిరిగా ఏళ్ల తరబడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Feb 2025 11:30 AM GMTమాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తూ సీరియల్ మాదిరిగా ఏళ్ల తరబడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన చిన్నాన్నను చంపిన హంతకులకు శిక్ష పడేలా చేయడంలో విఫలమయ్యారని వివేకా కూతురు సునీతా రెడ్డి పలుమార్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇక, ఆ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయనను మాత్రం అరెస్ట్ చేసి విచారణ జరపకపోవడాన్ని కూడా ఆమె విమర్శించారు.
అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు గురించి సీఎం చంద్రబాబును సునీత కలిశారు. ఆ తర్వాత కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గతంలో సంచలన ఆరోపణలు చేశాడు. కడప సెంట్రల్ జైల్లో తాను ఉన్నప్పుడు చైతన్య తనను కలిసి మభ్యపెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్య రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులపై తాజాగా కేసు నమోదైంది.
2023 నవంబర్‌లో జైలులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన చైతన్య రెడ్డి తనను బెదిరించారని దస్తగిరి ఆరోపించారు. బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్‌గా మారి అబద్దాలు చెప్పాల్సి వచ్చిందని, అలా చెప్పమని చైతన్య ఒత్తిడి తెచ్చాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు. తాము చెప్పినట్లు చేస్త రూ.20 కోట్లు ఇస్తామని చైతన్య ఆఫర్ ఇచ్చారని ఫిర్యాదు చేశారు. నిందితులకు మద్దతుగా ఉండాలని కొందరు పోలీసులు కూడా తనపై ఒత్తిడి తెచ్చారని దస్తగిరి కంప్లయింట్ ఇచ్చారు. దీంతో, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ జైలు సూపరెండెంట్ ప్రకాష్‌లపై కూడా కేసు నమోదైంది.
దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య రెడ్డికి గతంలో సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే, జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లానని, దస్తగిరిని బెదిరించలేదని చైతన్య రెడ్డి చెప్పారు. ఏది ఏమైనా..తాజా పరిణామాలు చూస్తుంటే వివేకా కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.