Begin typing your search above and press return to search.

దస్తగిరిని చంపేస్తాం.. భార్యకు బెదిరింపులు

ఇప్పటికే వివేకా హత్య కేసులో సాక్ష్యులు వరుసగా మరణించడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుండగా, తాజాగా దస్తగిరికి బెదిరింపులతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   17 March 2025 1:39 PM IST
దస్తగిరిని చంపేస్తాం.. భార్యకు బెదిరింపులు
X

రాష్ట్రంలో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. దస్తగిరి భార్య షబానాపై ఆదివారం దాడి చేసిన కొందరు మహిళలకు ఈ ఏడాది చివరి నాటికి దస్తగిరిని హత్య చేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటికే వివేకా హత్య కేసులో సాక్ష్యులు వరుసగా మరణించడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుండగా, తాజాగా దస్తగిరికి బెదిరింపులతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ఆరుగురు సాక్షులు వివిధ రకాల కారణాలతో మరణించారు. వీరిలో ప్రధాన సాక్షి, నిందితులను కళ్లారా చూసిన రంగన్న కూడా ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. సాక్షుల మరణంపై సిట్ ను నియమించింది. రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించిన పోలీసులు, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దీంతో సాక్షుల మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ హత్య కేసులో మిగిలిన ఏకైక సాక్షి దస్తగిరి.

వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి కోర్టు అనుమతితో అప్రూవర్ గా మారాడు. అప్పటి నుంచి ఆయనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు. ఆయనకు గతంలో 1 ప్లస్ 1 పోలీసు భద్రత ఉండేది. అయితే సాక్షుల మరణాలతో ఆందోళన చెందిన దస్తగిరి తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరాడు. ప్రభుత్వం కూడా స్పందించి దస్తగిరికి 2 ప్లస్ 2 భద్రత కల్పించింది.

అయితే ఆదివారం దస్తగిరి భార్య షబానాపై కొంతమంది మహిళలు దాడి చేసి మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఏడాదిలో నీ భర్తను నరికేస్తాం అంటూ బెదిరించారని షబానా మీడియాతో తెలిపారు. తనపై తాడిచేసిన వారు వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన షంషూన్, పర్వీన్ గా ఆమె తెలిపారు. తనపై దాడిచేయడమే కాకుండా అసభ్యకరంగా దూషించారని వాపోయారు. వివేకా హత్య కేసులో సాక్ష్యులు వరుసగా మరణిస్తున్న నేపథ్యంలో తన భర్తను అంతమొందించే అవకాశం ఉందని తమకు భయంగా ఉందని షబానా ఆవేదన వ్యక్తం చేశారు.