సాక్షులు చనిపోతున్నారు.. నా ప్రాణాలకు ముప్పు: దస్తగిరి
వివేకానంద రెడ్డి హత్య కేసు లో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి భద్రత కోరారు.
By: Tupaki Desk | 12 March 2025 6:30 PM ISTవివేకానంద రెడ్డి హత్య కేసు లో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి భద్రత కోరారు. తనకు ముందుగా ఉన్న భద్రతను కొనసాగించాలని, మరింత రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సాక్షులు చనిపోతుండటంతో, ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
వినతి పత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన దస్తగిరి, ‘‘వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో అందరికీ తెలుసు. మాతో తప్పు చేయించి ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ కేసుపై బహిరంగంగా మాట్లాడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా? నేను ఆయన ఇంటికి దగ్గర నివసిస్తున్నందున ప్రాణహాని ఉందని భావిస్తున్నాను. అందుకే మరింత భద్రత కల్పించాలని కోరుతున్నాను,’’ అని తెలిపారు.
గతంలో తనకు టు ప్లస్ టు భద్రత ఉండేదని, అయితే దానిని తగ్గించినట్లు దస్తగిరి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరింత భద్రతను కల్పించాలని ఆయన కోరారు. వివేకా కేసు అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినట్లు పేర్కొన్న దస్తగిరి, ఈ కేసులో సాక్షుల వరుస మరణాలు జరుగుతున్నాయని, దీంతో తనకు వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని విన్నవించారు.
ఇప్పటికే కడప జైలులో డాక్టర్ చైతన్యరెడ్డి తనను బెదిరించిన ఘటనలను ప్రస్తావించిన ఆయన, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన భద్రతను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2021లో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొన్ని రోజుల్లోనే కుట్రదారుల వివరాలు బయటకు వచ్చాయని దస్తగిరి తెలిపారు. తాను చెప్పిన విషయం తప్పేనా? అది నిజమైతే, జగన్ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. డాక్టర్ చైతన్య రెడ్డి జైలులో తనను బెదిరించిన ఘటనపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీబీఐ అధికారులు త్వరలోనే ఈ కేసుపై విచారణ చేపట్టనున్నారు అని తెలియజేశారు.