Begin typing your search above and press return to search.

రూ.20 కోట్లు జైలుకు తెచ్చి ఆఫర్‌ చేశారు!

దర్యాప్తులో భాగంగా అరెస్ట్‌ చేస్తారని ముందుగానే ఊహించిన అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారని దస్తగిరి ఆరోపించాడు

By:  Tupaki Desk   |   15 March 2024 4:15 AM GMT
రూ.20 కోట్లు జైలుకు తెచ్చి ఆఫర్‌ చేశారు!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తూ, సాక్షులను బెదిరిస్తున్న 8వ నిందితుడు, కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ ను రద్దు చేయాలని అప్రూవర్‌ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.


దర్యాప్తులో భాగంగా అరెస్ట్‌ చేస్తారని ముందుగానే ఊహించిన అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారని దస్తగిరి ఆరోపించాడు. కేసులోని తీవ్రతను, అవినాష్‌ రెడ్డి పాత్రపై సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా గత ఏడాది మే 31న సింగిల్‌ జడ్జి షరతులతో బెయిలు మంజూరు చేశారని దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బెయిలు షరతులను ఉల్లంఘించినందున ఆయన బెయిలును రద్దు చేయాలని దస్తగిరి కోరాడు. ఈ పిటిషన్‌పై మార్చి 15న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

వైఎస్‌ వివేకా హత్య కేసులో దస్తగిరి నాలుగో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు అప్రూవర్‌ గా మారాడు. ఈ నేపథ్యంలో

సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును ఉల్లంఘిస్తున్న అవినాష్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలని దస్తగిరి తన పిటిషన్‌ లో కోరాడు.

వివేకా హత్య కేసులో తన సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లతోపాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆఫర్‌ చేశారని దస్తగిరి సంచలన ఆరోపణలు చేశాడు. తాము చెప్పినట్టు వినకపోతే తనతోపాటు తన కుటుంబం కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని దస్తగిరి ఆ పిటిషన్‌ లో పేర్కొన్నాడు.

కడప జిల్లా పులివెందుల మండలం నామాలగుండు గ్రామంలో తన తండ్రిపై మార్చి 8 రాత్రి అవినాష్‌ రెడ్డి అనుచరులు ముగ్గురు హత్యాప్రయత్నం చేశారని దస్తగిరి ఆరోపించాడు. అవినాష్‌ రెడ్డి అనుచరుల దాడిలో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడని వెల్లడించాడు. సీబీఐ రక్షణ తనకు ఉండటంతో తనకేమీ కాదని.. అయితే తన కుటుంబానికి రక్షణ లేకపోవడంతో వారిని టార్గెట్‌ చేస్తున్నారని దస్తగిరి విమర్శించాడు. తన తండ్రిపై హత్యాయత్నం ద్వారా తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించాడు.

అలాగే తాను వేరే నేరం కింద జైలులో ఉన్నప్పుడు అవినాష్‌ అనుచరులు తనను హత్య చేయడానికి ప్రయత్నించారని దస్తగిరి ఆరోపించాడు. తన సాక్ష్యం లేకుండా చేస్తే ఈ కేసు నుంచి బయటపడొచ్చని వారు భావిస్తున్నారని వెల్లడించాడు.

ఇతర కేసుల్లో భాగంగా తాను కడప కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి.. జైలు సూపరింటెండెంట్‌ ను ప్రభావితం చేసి నవంబరు 28న మెడికల్‌ క్యాంపయిన్‌ పేరుతో జైల్లోకి వచ్చాడని దస్తగిరి ఆరోపించాడు. రూ. 20 కోట్లతో నేరుగా తన బ్యారక్‌ వద్దకు వచ్చాడన్నారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే తన కుటుంబాన్ని, పిల్లలను అవినాష్‌ రెడ్డి చూసుకుంటారని రూ.20 కోట్లతో తనను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కావాలంటే ఫోన్‌లో అవినాష్ తో మాట్లాడిస్తానని కూడా చెప్పారన్నారు. తన వల్లనే దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి జైలులో ఉన్నారని.. వారికి ఏదైనా జరిగితే తన కుటుంబం అంతు చూస్తామని బెదిరించారన్నారు.

తాము చెప్పింది చెప్పినట్టు చేస్తే తన కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడంతోపాటు అన్నీ చూసుకుంటామని ఆశచూపారని దస్తగిరి ఆరోపించాడు. రాజకీయ కుటుంబ వివాదాల్లోకి తనను రావద్దని హెచ్చరించారని పిటిషన్‌ లో పేర్కొన్నాడు.

మరోవైపు వివేకా హత్య కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏడో నిందితుడైన వైఎస్‌ భాస్కరరెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని, అంతేగాకుండా అనారోగ్యంతో బాధపడుతున్నానని నివేదించారు. సీబీఐ కోర్టులో విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదన్నారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని, బెయిలు మంజూరు చేయాలని విన్నవించారు.