Begin typing your search above and press return to search.

కంటతడి పెట్టించే వీడియో... ఇలాంటి కూతుళ్లున్న తండ్రి ఎంత అదృష్టవంతుడో!

"మరి మీరెక్కడ ఉంటున్నారు సర్?".. మరో ప్రశ్న! "అనాధాశ్రమంలో!"... పెద్దాయన సమాధానం!.. చాలా చోట్ల జరుగుతున్న తాజా పరిస్థితులపై ఈ కామెంట్ చాలా ఫేమస్!

By:  Tupaki Desk   |   19 Nov 2024 1:51 PM GMT
కంటతడి పెట్టించే వీడియో... ఇలాంటి కూతుళ్లున్న తండ్రి ఎంత అదృష్టవంతుడో!
X

"మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు సర్?" ఓ పెద్దాయనను ఒక వ్యక్తి అడుగుతాడు! దీనికి సమాధానంగా... "పెద్ద కొడుకు అమెరికాలో, చిన్న కొడుకు ఆస్ట్రేలియాలో, కూతురు కెనడాలో" ఉంటున్నారని చెబుతాడు పెద్దాయన. "మరి మీరెక్కడ ఉంటున్నారు సర్?".. మరో ప్రశ్న! "అనాధాశ్రమంలో!"... పెద్దాయన సమాధానం!.. చాలా చోట్ల జరుగుతున్న తాజా పరిస్థితులపై ఈ కామెంట్ చాలా ఫేమస్!

ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పడాని ఈ ఉదాహరణ! అలా అని అంతా అలా ఉన్నారని కాదు.. ఉన్నవాళ్లలో చాలా మంది అలా ఉన్నారని! ఇక ఆస్తుల కోసం కన్న తల్లితండ్రులను రోడ్లపై వదిలేసేవాళ్లు కొందరైతే.. బ్రతికుండగానే కాటిలో వదిలేసే దూరదృష్టి గల బిడ్డలు మరికొందరు! ఈ సమయంలో మతిస్థిమితం లేక తప్పిపోయి ఆరేళ్ల తర్వాత కనిపించిన తండ్రిని చూసిన కూతుళ్ల ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... హైదరాబాద్ లోని మాతృదేవోభవ అనాధాశ్రమంలో ఎంతో మంది అనాధలు ఆశ్రయం పొందుతున్నారు. వీరి సంఖ్య సుమారు 130 వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో బాలయ్య అనే వ్యక్తి తిరుగుతుంటే... అతడిని ఈ ఆశ్రయం నిర్వాహకులు చేరదీసి ఆశ్రయం కల్పించారు.

ఈ క్రమంలో... గత నెలలో మాతృదేవోభవ అనాధాశ్రమానికి వచ్చి.. తమ తండ్రి తప్పిపోయాడని.. మతి స్థితిమితం లేదని.. అతడి కోసం గాలిస్తున్నామని బాలయ్య కూతురు దివ్య తెలిపారు. తన సోదరి, ఆమె కలిసి ఈ అనాధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సమయంలో మతిస్థితిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి కూతుళ్లు గుర్తుపట్టారు. ఒక్కసారిగా ఇద్దరు కూతుళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

అక్కడున్న 130 మందిలోనూ తన తండ్రిని గుర్తుపెట్టిన ఇద్దరు కూతుళ్ల ఆనందానికి హద్దు లేకుండా పోయింది! అయితే... బాలయ్య మాత్రం వారిని చూసి భయాందోళన చెందాడు. అయితే... ‘భయపడాల్సిన పనిలేదు, వీళ్లు మీ కూతుళ్లే’ అని ఆశ్రయంలో ఉన్న వ్యక్తి చెప్పడంతో.. బాలయ్య అర్ధం చేసుకున్నట్లున్నాడు! ఇద్దరు కూతుళ్లు, మనవళ్లతో ఆనందంగా గడిపాడు.

ఈ సమయంలో తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్తామని ఆశ్రమ నిర్వాహకులను ఇద్దరు కూతుళ్లు అడిగారు. అయితే... ఈ సందర్భంగా కొన్ని కండిషన్స్ పెట్టిన వారు.. బాలయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఇది చూసి చాలా మంది తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు! ఇలాంటి కూతుళ్లు ఉంటే చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.