బిగ్ మూమెంట్... రతన్ టాటాపై బ్రిటన్ మాజీ పీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఇందులో ప్రధానంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టాటా మోటార్స్ టేకోవర్ చేయడాన్ని కామెరూన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దీన్ని ఓ "బిగ్ మూమెంట్" గా ఆయన అభివర్ణించారు!
By: Tupaki Desk | 22 Oct 2024 2:57 AM GMTసోమవారం జరిగిన ఎన్.డీ.టీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్న బ్రిటీష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్.. రతన్ టాటా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టాటా మోటార్స్ టేకోవర్ చేయడాన్ని కామెరూన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. దీన్ని ఓ "బిగ్ మూమెంట్" గా ఆయన అభివర్ణించారు!
అవును... బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ రెండు వ్యాపారాలను టాటా కొనుగోలు చేయడం అనేది.. ప్రపంచ వేదికపైకి భారత ఆర్థిక వ్యవస్థ వచ్చిందనడానికి మేల్కొనే క్షణం అని అన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బ్రిటీష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్.
ఇందులో భాగంగా తాను బ్రిటీష్ ప్రధానిగా ఉన్న సమయాల్లో రతన్ టాటా తనకు సలహాలు ఇచ్చేవారని.. ఓ భారతీయ కంపెనీ బ్రిటన్ లోకి ప్రవేశించి, దాని కంపెనీలపై పెట్టుబడులు పెట్టడం, వృద్ధి చెందడం వంటి వాటిని ప్రధానమైన వ్యక్తిగా రతన్ టాటా ఉన్నారని డేవిడ్ కామెరూన్ గుర్తు చేసుకున్నారు.
యుద్ధంలో మధ్యవర్తిత్వం!:
ఇక... ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్ కు ఉందని యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభ తీవ్రతను ఈ మధ్యవర్తిత్వ చర్య తగ్గించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2015లో మోడీతో లండన్ లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఓ ఘటనను గుర్తుచేసుకున్నారు.
ఇందులో భాగంగా... తమ దేశంలో ప్రధాని కానీ.. పార్టీ నాయకుడు కానీ నాలుగు వేల మందితో మాట్లాడితే చాలా అదృష్టంగా భావిస్తామని.. అయితే మోడీ ఏకంగా 85,000 మందిని ఉద్దేశించి వెంబ్లీ స్టేడియంలో ప్రసంగించారని తెలిపారు.
కాగా 16వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ త్వరలో మాస్కోలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షతన కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది.