Begin typing your search above and press return to search.

3 మ్యాచ్ లు.. రూ.1.25 కోట్లు.. పెళ్లి వాయిదా.. క్రికెటర్ సంచలనం

అంతర్జాతీయ క్రికెటర్ల జీవనం భిన్నంగా ఉంటుంది. విదేశీ టూర్ల కారణంగా కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుంది

By:  Tupaki Desk   |   13 March 2024 12:01 PM GMT
3 మ్యాచ్ లు.. రూ.1.25 కోట్లు.. పెళ్లి వాయిదా.. క్రికెటర్ సంచలనం
X

అంతర్జాతీయ క్రికెటర్ల జీవనం భిన్నంగా ఉంటుంది. విదేశీ టూర్ల కారణంగా కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉండాల్సి వస్తుంది. వేర్వేరు టైమ్ జోన్ లకు అలవాటు పడడమే కష్టం అనుకుంటే.. ఇంటికి దూరంగా ఉండడం మరింత కుంగదీస్తుంటుంది. ఈ కారణంగానే చాలామంది మానసికంగా అలసిపోయామంటూ విశ్రాంతి తీసుకుంటుంటారు. కొన్నిసార్లు కుటుంబాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సిరీస్ లకు దూరంగా ఉంటారు. మొన్నటికి మొన్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య రెండో బిడ్డకు జన్మనిస్తున్న సందర్భంలో ఆమెకు దగ్గరగా ఉండేందుకు ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ దూరంగా ఉన్నాడు. ఇప్పడు దీనికి భిన్నంగా మరో ఘటన చోటుచేసుకుంది.

పెళ్లి కంటే క్రికెట్ మ్యాచ్ ముఖ్యం..

దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు డేవిడ్ మిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుజరాత్ టైటాన్స్ విజయ ప్రస్థానంలో మిల్లర్ దే ప్రధాన పాత్ర. దక్షిణాఫ్రికా వన్డే, టి20 జట్టులో ప్రధాన ఆటగాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టాడు. ఇక మిల్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాత్రమే కాక.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ లు ఆడుతుంటాడు. ప్రస్తుతం అతడు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్ లో ఫార్చూన్ బరిషల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే, అతడికి ఓ సమస్య వచ్చి పడింది. సరిగ్గా తన పెళ్లి ముంగిట మూడు మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు వెళ్లిపోతుంటారు. కానీ, మిల్లర్ లాంటి వాడు దూరమైతే జట్టుకు కష్టాలే. అందుకనే.. ఫ్రాంచైజీ ఏకంగా మూడు మ్యాచ్‌ లు ఆడితే భారీ మొత్తం ఆఫర్ చేసింది. ఏకంగా రూ.1.25 కోట్లను చెల్లిస్తామని చెప్పింది. దీనికోసం పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లు ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్‌ 2), మార్చి 1న (ఫైనల్‌) జరిగాయి. చివరకు ఫార్చూన్ బరిషల్‌ జట్టే బంగ్లా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌ గా నిలిచింది. దీనికంటే ముందు మిల్లర్ చేసిన పనే ఎక్కువ చర్చనీయాంశం అవుతోంది. మిల్లర్‌ బీపీఎల్‌ ముగిసిన తర్వాత తన స్నేహితురాలు కామిల్లా హారిస్‌ను ఈ నెల 10న పెళ్లాడాడు.

బయటపెట్టిన అక్రమ్..

మిల్లర్ రూ.1.25 కోట్ల కహానీని పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ బయటపెట్టాడు. తాను పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌ తో బిజీగా ఉన్నానని.. బీపీఎల్‌ ను పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు. ఛాంపియన్‌ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించగా మిల్లర్ సంగతి బయటపడిందన్నాడు.. చివరి మూడు మ్యాచ్‌ లను ఆడితే అతడికి 1.50 లక్షల డాలర్లు (రూ. 1.25 కోట్లు) ఇచ్చేందుకు ఫ్రాంచైజీ ముందుకొచ్చిందన్నాడు.