Begin typing your search above and press return to search.

చంద్రబాబు, రేవంత్ రెడ్డికి తగిన సమయమిచ్చిన దావోస్.. ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే..?

పెట్టుబడుల వేట కోసం దావోస్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అక్కడ మనసు విప్పి మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Jan 2025 3:30 PM GMT
చంద్రబాబు, రేవంత్ రెడ్డికి తగిన సమయమిచ్చిన దావోస్.. ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే..?
X

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ బంధం ఎంతటి ధ్రుడమైనదో అందరికీ తెలిసిందే. అలా అని ఇద్దరూ కలిసిమెలిసి తిరిగే పరిస్థితి ఉందా? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఆయనతో కలిసి పనిచేయడం దాదాపు అసాధ్యం. రేవంత్ తో జోడి విషయంలో చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, తన రాజకీయ గురువు చంద్రబాబుతో బహిరంగంగా అనుబంధం కొనసాగించడం రాజకీయంగా రేవంత్ కు శ్రేయస్కరం కాదనే వాదన ఉంది. అందుకే దేశంలో ఉన్నప్పుడు ఇద్దరూ దూరం.. దూరం అంటూ వ్యూహాత్మక గ్యాప్ మెంటైన్ చేస్తున్నారు. అయితే వీరిద్దరికీ దావోస్ చక్కని వేదికగా మారిందని, వేరే ఊహాగానాలకు ఆస్కారం ఇవ్వకుండా ఇద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి తగిన సమయం ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో మునుముందు కూడా ఈ ఇద్దరి మధ్య చర్చలకు విదేశాలే వేదిక కాబోతున్నాయంటున్నారు.

పెట్టుబడుల వేట కోసం దావోస్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అక్కడ మనసు విప్పి మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెట్టుబడులపై అధికారిక చర్చలు ఒకవైపు కొనసాగుతుండగానే, సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరూ స్థానిక రాజకీయాలు, అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించి ఉంటారని ప్రచారం జరుగుతుంది . ఇద్దరూ హైదరాబాద్లో కలుసుకునే అవకాశం ఉన్నా, తమ రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రం ఇవ్వడం ఎందుకనే కారణంతో వ్యూహత్మక దూరం పాటిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలపైనా పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఏదైనా ముఖ్యమైన అంశం ఉంటే అధికారుల స్థాయిలోనే చర్చించి తగిన పరిష్కారం కనుగొంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుండగా, చంద్రబాబు గెలిచి ఏడు నెలలు అవుతోంది. అయితే జగన్ ఏపీ సీఎంగా ఉండగా రేవంత్ రెడ్డిని అసలు కలవకపోగా, చంద్రబాబు గెలిచిన తర్వాత నెల రోజులకు తెలంగాణ సీఎంని కలిశారు. పలు సమస్యలుపై చర్చించి మంత్రులు, అధికారులతో కమిటీలు వేశారు. ఇద్దరూ మరోసారి కలవాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు వారానికి ఒకసారి లేదంటే పది హేను రోజులకు ఒకసారైనా హైదరాబాద్ వచ్చిపోతున్నారు. కానీ, ఆయనతో రాజకీయ, వ్యక్తిగత అనుబంధం కొనసాగించడంలో తెలంగాణ సీఎం వ్యూహాత్మక దూరమే పాటిస్తున్నారు. ఇద్దరు ఇళ్లూ జూబ్లీహిల్స్ లో ఒకే చోట ఉన్నా, హైదరాబాద్లో ఉండగా, ఇద్దరూ ఎదురుపడకుండానే జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. దీనికి ప్రధానంగా చంద్రబాబుతో బంధం కొనసాగించే విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటున్నారు. చంద్రబాబుతో తాను సన్నిహితంగా ఉంటే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి విపక్షం బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే చంద్రబాబును తన గురువుగా అంగీకరించకుండా, బాబు అంటే తనకు గౌరవమని కానీ, ఆయన తనకు గురువు కాదని చెబుతున్నారు. తాను చంద్రబాబుకు సహచరుడని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు బీజేపీ భాగస్వామిగా ఉండటం కూడా రేవంత్ రెడ్డికి అభ్యంతరకరంగా మారింది. ఇలాంటి సమయంలో చంద్రబాబుతో అనుబంధం కొనసాగించడం క్లిష్టంగా మారడం వల్ల దావోస్ ఇద్దరికి మంచి వేదికగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

20వ తేదీన దావోస్ వెళ్లే ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు. ముందుగా స్విర్జర్లాండులో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసివున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ తర్వాత అధికారికంగా ఇద్దరూ పలు సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి ఫొటోలు బయట పెట్టలేదు. ఇక సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరు స్థానిక రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపి ఉంటారని అంటున్నారు.

ఇద్దరు నేతల మధ్య పలు ధపాలుగా చర్చలు జరిగినప్పటికీ ఒకేసారి కలుసుకున్నట్లు చెప్పడం వెనుక వ్యూహం ఉందంటున్నారు. ప్రధానంగా ఇప్పటికీ టీ సీఎం రేవంత్ రెడ్డిని చిట్టి నాయుడు అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు డైరెక్షనులోనే నడుచుకుంటున్నారని చెబుతూ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందాలని చూస్తోంది. అయితే ఈ కామెంట్లపై రేవంత్ రెడ్డి ఎక్కడా స్పందించడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి ఊతమిచ్చేలా చంద్రబాబుతో ఎక్కువ సమయం గడిపినట్లు కనిపిస్తే అసలుకే మోసం వస్తుందని రేవంత్ రెడ్డి అప్రమత్తంగా వ్యవహరించారని అంటున్నారు.

మొత్తానికి దావోసులో ఇరువురు సీఎంల పర్యటనను రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు డేగ కన్నుతో పరిశీలించాయి. బాబుతో రేవంత్ బంధమే తమకు అస్త్రంగా మారుతుందని భావించిన బీఆర్ఎస్ ఆలోచనకు చిక్కుండా సీఎం అప్రమత్తంగా వ్యవహరించారని అంటున్నారు. దావోస్ పర్యటనలో తమకు కావాల్సిన సమయం, స్వేచ్ఛ లభించడంతో మునుముందు విదేశీ వేదికలపైనే తమ రాజకీయ బంధంపై చర్చించాలని ఇరువురు ముఖ్యమంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఇద్దరూ పెట్టబడుల అన్వేషణకు హోరాహోరీగా పోటీపడటం కూడా ఆశ్చర్యకరంగా మారింది. ఈ విషయంలో గురువు చంద్రబాబుపై రేవంత్ రెడ్డిదే పైచేయి అయినట్లు చెబుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీకన్నా ఎక్కువగా తెలంగాణపైనే పారిశ్రామిక వేత్తలు మోజు చూపడంతో రికార్డు స్థాయి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏదిఏమైనా దావోస్ వేదికగా గురుశిష్యుల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.