టాస్క్ ఫోర్సు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్టుపై కీలక ప్రకటన!
తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్ టాస్క్ ఫోర్సు మాజీ ఓస్డీగా వ్యవహరించిన రాధాకిషణ్ రావును పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 30 March 2024 4:56 AM GMTరెండు తెలుగురాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖులు.. వ్యాపారవేత్తలు.. సినీ రంగానికి చెందిన వారు.. ఇలా ఒకరేంటి? ఒకరు కాదేమిటి? అన్న రీతిలో అందరి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం.. గడిచిన కొద్ది రోజులుగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున అరెస్టులు కావటం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్ టాస్క్ ఫోర్సు మాజీ ఓస్డీగా వ్యవహరించిన రాధాకిషణ్ రావును పోలీసులు అరెస్టు చేశారు.
గురువారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నట్లుగా ఆయన అంగీకరించినట్లుగా అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగు చూసిన తర్వాత ట్యాపింగ్ అంశంలో ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి వెలువడిన అధికారిక ప్రకటన ఇదేనని చెప్పాలి.
పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఏముందంటే..
"ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్సు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును గురువారం విచారించాం. ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నట్లుగా రాధాకిషన్ రావు అంగీకరించారు. రాజకీయ నాయకులు.. ఇతర వ్యక్తులపై నిఘా పెట్టినట్లుగా చెప్పారు. రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలు చేపట్టినట్లుగా ఒప్పుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అక్రమంగా రవాణా చేస్తున్న నగదు స్వాధీనంలోనూ అక్రమాలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. కేసులో ఇతర నిందితులతో కుమ్మక్కై.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాక్ష్యాల ధ్వంసం.. వాటిని కనిపించకుండా చేయటంలో సహకరించానని అంగీకరించారు" అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం న్యాయమూర్తి ఎదుట రాధాకిషన్ రావును హాజరుపర్చగా పద్నాలుగు రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చంచలగూడ జైలుకు తరలించారు.