వారం రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. హైదరాబాద్ లో షాకింగ్ ఉదంతం
భరించలేని దుర్వాసనతో పక్కింట్లో ఉన్న యువకులు అనుమానించటంతో ఈ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 21 Dec 2023 4:46 AM GMTవిన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. జీర్ణించుకోవటం కష్టంగా ఉండే ఈ ఉదంతం హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఇంట్లోని వ్యక్తి మరణించినా.. పట్టించుకోని దైన్యాన్ని చూసి అయ్యో అనుకోకుండా ఉండలేం. ఇంట్లోని వ్యక్తి మరణించినా.. మానసిక స్థితి సరిగా లేని తల్లి కానీ.. సోదరుడు కానీ గుర్తించకుండా ఉండిపోయిన వైనం షాకిచ్చేలా మారింది. భరించలేని దుర్వాసనతో పక్కింట్లో ఉన్న యువకులు అనుమానించటంతో ఈ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన 45 ఏళ్ల రాధాకుమారి.. ఆమె తల్లి విజయలక్ష్మి.. సోదరుడు పవన్ కలిసి ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం వారు హైదరాబాద్ కు వచ్చి చింతల్ లో ఉంటున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రాధాకుమారి విడాకులు తీసుకున్నారు. దీంతో.. తల్లి.. సోదరుడితో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. వైద్యం చేయిస్తున్నా ఫలితం లేని పరిస్థితి. రాధాకుమారి సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవటంతో వారిద్దరిని అతడే చూసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో అతడి మానసిక స్థితి సరిగా లేకపోవటంతో అతన్ని జాబ్ నుంచి తొలగించారు. దీంతో.. పవన్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు.
వారం క్రితం సోదరి ప్రాణాలు పోయినా గుర్తించలేదు. పక్కింట్లో ఉండే యువకులు పవన్ టూ వీలర్ ను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండేవారు. తాజాగా.. వారు వాహనం అవసరమై తలుపు తట్టగా సమాధానం చెప్పలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో.. అనుమానించి.. తలుపు నెట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. మంచం మీద రాధాకుమారి చనిపోయి ఉండటమేకాదు.. ఆమె డెడ్ బాడీకి పురుగులు పట్టిన పరిస్థితి. సోదరి చనిపోయిన విషయాన్ని సోదరుడు గుర్తించకపోవటమే కాదు ఏమీ సమాధానం చెప్పట్లేదు. దీంతో భయపడిన సదరుయువకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. మానసిక స్థితి సరిగా లేని ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.