Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యాన్ని హడలెత్తిస్తున్న టోర్నడోలు.. ఇప్పటికి 29 మంది దుర్మరణం

విపరీత ప్రతికూల వాతావరణం కారణంగా 100 మిలియన్లకు పైగా ప్రజలు నివసించే ప్రాంతాలు ప్రభావితం అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2025 10:02 AM IST
అగ్రరాజ్యాన్ని హడలెత్తిస్తున్న టోర్నడోలు.. ఇప్పటికి 29 మంది దుర్మరణం
X

అగ్రరాజ్యాన్ని హడలెత్తిస్తున్నాయి టోర్నడోలు. ప్రపంచం మొత్తాన్ని తనకున్న అధిక్యతతో కంట్రోల్ చేసే అమెరికాను ప్రకృతి అప్పుడప్పుడు పరీక్షలు పెట్టటం తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న వినాశకరమైన టోర్నడోలకు దాదాపు 29 మంది బలైనట్లుగా అమెరికా మీడియా వెల్లడిస్తోంది. పలు ప్రాంతాలకు తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. ఈ తీవ్రత మరికొంత ఉంటుందని చెబుతున్నారు.భారీ తుపాను కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విపరీత ప్రతికూల వాతావరణం కారణంగా 100 మిలియన్లకు పైగా ప్రజలు నివసించే ప్రాంతాలు ప్రభావితం అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

బలమైన టోర్నడోల కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయని.. పెద్ద ఎత్తున ప్రాణ.. ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. అమెరికా మిడ్ వెస్ట్.. సౌత్ ప్రాంతాల్లో వస్తున్న తుపానులు అనేక రాష్ట్రాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ టోర్నడోలు.. దుమ్ము తుపానులు.. కార్చిచ్చులతో మిస్సోరి.. అర్కాన్సాస్.. టెక్సాస్.. ఒక్లహోమా.. కాన్సాస్.. మిస్సిసిప్పి రాష్ట్రాలు అతలాకుతలం చేస్తున్నాయి.

తుఫానుల ధాటికి ఒక్క మిస్సోరిలోనే 12 మంది మరణించటం గమనార్హం. మరణాల సంఖ్య ఎక్కువ అవుతుందని.. రాత్రివేళలో విరుచుకుపడిన టోర్నడోలకు పలు ఇళ్లను నేలమట్టం చేశాయని చెబుతున్నారు. వేన్ కౌంటీ.. బట్లర్ కౌంటీలో పరిస్థితి తీవ్రంగా ఉందంటున్నారు. అక్కడ ఇళ్లు కనిపించటం లేదని.. శిథిలాల క్షేత్రంగా కనినపిస్తోందని చెబుతున్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒకవైపు తుఫాను విరుచుకుపడుతుంటే.. మరోవైపు ఓక్లహోమా అడవిలో మంటలు భీకరరూపం దాల్చటం గమనార్హం. మొత్తం 130 చోట్ల మంటలు నమోదైనట్లుగా చెబుతున్నారు. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితులు పలు ప్రాంతాల్ని ప్రభావితం చేస్తాయన్న అంచనా వ్యక్తమవుతోంది.

మిన్నెసోటా.. దక్షిణ డకోటాల్లో మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. టెక్సాస్.. ఓక్లహోమా రాష్ట్రాల్లో అడవి మంటలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. వందలాది చదరపు మైళ్ల విస్తీర్ణంలో కార్చిచ్చులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజా తుఫాను తీవ్రత లూసియానా నుంచి ఫ్లోరిడా పాన్ హ్యాండిల్ వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు.